Christmas Celebrations in Medak Church : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కట్టడాలలో మెదక్(Medak) చర్చి ఒకటి. యారప్ గోథిక్ విధానంలో చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై 1924లో పూర్తయింది. లండన్‌కు చెందిన రెవరెంట్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ అనే మత గురువు చర్చి నిర్మాణానికి పూనుకున్నాడు. పనికి ఆహారం విధానంలో నిర్మాణం ప్రారంభించి అప్పటి ప్రజల ఆకలి తీర్చాడు.
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - అందంగా ముస్తాబైన చర్చిలు
మెదక్ పట్టణంతో పాటు రామాయంపేట, చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి, పొరుగున్న ఉన్న కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన అనేక మంది చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. 12 వేల మంది కార్మికులు పదేళ్లు శ్రమించి అద్భుత కట్టడాన్ని సాకారం చేశారు. ఇందుకు కావలసిన నిధులను ఫాస్నెట్ ఇంగ్లండ్ నుంచి విరాళాల ద్వారా సేకరించారు. అలా మహోన్నత ఉద్దేశంతో శ్రమ జీవుల చెమట నుంచి పుట్టిందే మెదక్ చర్చి.
History of Medak Church : ఇంగ్లాండ్‌కు చెందిన పాస్టర్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మెదక్ చర్చిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం తన మిత్రుడైన ఇంజినీర్ బ్రాడ్‌షాతో 200 డిజైన్లను గీయించి అందులో ప్రస్తుత చర్చి నమూనాను ఎంపిక చేశాడు. పూర్తిగా రాళ్లు, డంగుసున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తు టవర్, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో చర్చిని గోథిక్ శైలిలో అత్యంత సుందరంగా నిర్మించారు.
దేశ, విదేశీ నిర్మాణరంగ నిపుణుల పర్యవేక్షణలో చర్చి నిర్మాణం కొనసాగింది. చర్చి లోపల ఇటాలియన్ టైల్స్‌ను వినియోగించారు. జెకొస్లోవేకియా దేశస్థులు దేవదారు కర్రతో గద్ద రూపంలో బైబిల్ పఠన వేదికను, రంగూన్ టేకుతో భోజనపు బల్ల, రోజ్‌వుడ్‌తో తయారుచేసిన టేబుల్లు, కుర్చీలు, దర్వాజాలు ఆకట్టుకుంటాయి.
చర్చిలో గాజు నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లండన్‌కు చెందిన కళాకారుడు ప్రాంక్ సాలిస్‌బరి చర్చిలో ఎత్తైన విండోస్‌పై చిన్న రంగు రంగుల గ్లాస్ ముక్కలకు అమర్చి ఏసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను కళ్లకు కట్టినట్టు రూపొందించాడు. చర్చిలో కుడివైపున ఉన్న విండోపై క్రీస్తు జననం, ఎడమ వైపు ఉన్న విండోపై క్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యం, ఎదురుగా ఉన్న విండోపై క్రీస్తు ఆరోహణ దృశ్యాలు ఉంటాయి. బయట నుంచి సూర్యకాంతి పడినపుడు మాత్రమే ఈ విండోస్‌పై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.
ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఈ కెథడ్రల్ చర్చి ఆసియాలో పెద్ద చర్చిగా పేరు పొందింది. చారిత్రక, వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మదిలో మెదిలిన ఆలోచన, ఇంజినీర్ బ్రాడ్‌షా రూపొందించిన నమూనా, థామస్ ఎడ్వర్డు వాస్తు నైపుణ్యం, ఇటలీ దేశాల ఆర్కిటెక్చర్‌ల సమష్టి కృషితో అద్భుత నిర్మాణం నేడు మనకు దర్శనమిస్తోంది.
మెదక్ చర్చిలో ఏటా డిసెంబరు 25వ తేదీన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను(Christmas Celebrations) అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మెదక్ చర్చి పర్యాటక ప్రాంతంగానూ పేరుగాంచింది. చర్చిని చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఏడాది పొడుగునా సందర్శకులు వస్తుంటారు.
"ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఈ కెథడ్రల్ చర్చి ఆసియాలో అతి పెద్ద చర్చిగా పేరు పొందింది. చారిత్రక, వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ పనికి ఆహారం విధానంలో నిర్మాణం ప్రారంభించి అప్పటి ప్రజల ఆకలి తీర్చాడు". - బిషప్, మెదక్ చర్చి
రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - ప్రభుత్వం తరఫున పేదలకు కానుకలు