మెదక్ జిల్లా నర్సాపూర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ అరుణారెడ్డితో పాటు మరో ముగ్గురు నిందితుల తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీ ముగిసిందని... దర్యాప్తు సైతం పూర్తైనందున బెయిల్ ఇవ్వాలని నిందితుల తరఫున న్యాయవాది వాదించారు.
కోటి 12లక్షల లంచం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.... దీనికి సంబంధించి ఇంకా సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని అనిశా తరఫున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిందితులు బయటికి వస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని అనిశా తరఫు న్యాయవాది వాదించారు.
ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామంలో లింగమూర్తికి చెందిన 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి అదనపు కలెక్టర్ నగేశ్ కోటి 12లక్షల లంచం తీసుకున్నాడు. ఇదే వ్యవహారంలో ఆర్డీఓ అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్ చెరో లక్ష రూపాయలు, జూనియర్ అసిస్టెంట్ వసీమ్ 3లక్షలు లంచం తీసుకున్నాడు. ఈ కేసులో ఐదుగురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన అనిశా అధికారులు... దర్యాప్తులో పురోగతి కోసం కస్టడీలోకి తీసుకొని కూడా విచారించారు.
అదనపు కలెక్టర్ నగేశ్ బినామీ పేర్లమీద భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు. బినామీ ఆస్తులను తేల్చేందుకు అనిశా అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.