సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉంచామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. వాట్సప్, ఫేస్‌బుక్ ఇతర ఎలాంటి గ్రూప్‌లలో తప్పుడు వార్తల సందేశాలు పంపితే అడ్మిన్‌దే పూర్తి బాధ్యత అని ఆయన హెచ్చరించారు.
కొందరు సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకొని వర్గాలుగా మారి మతపరమైన అంశాలను ప్రేరేపించేలా సందేశాలు వ్యాప్తి చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. ప్రముఖుల వ్యక్తిగత అంశాలతో పాటు సమాజంలో కల్లోలానికి, అశాంతికి ఆజ్యం పోస్తున్నారని తెలిపారు. వదంతులను ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాలను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు.
అసత్య ప్రచారాలను కొందరూ నమ్మకపోయినా, అవగాహన లేని వ్యక్తులు సందేశాలను నమ్మే ప్రమాదం ఉందన్నారు. కరోనాపై ఆకతాయిలు పలు ఛానళ్లలో బ్రేకింగ్ వచ్చినట్లు గ్రాఫిక్స్ చేస్తూ వాట్సప్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. వాట్సప్‌లలో పోస్టు చేసే అంశాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.
ఫేస్‌బుక్‌లో ఇతర మతాలను, వారి మనోభావాలను దెబ్బతీసేలా, ప్రధాని మోదీపై అసత్య సందేశాలు పంపిన గోదావరిఖని, పెద్దపల్లి, ధర్మారంలకు చెందిన జుంజిపల్లి శంకరయ్య, యాకుల తిరుపతియాదవ్, ఉయ్యంకర్ సాయికిరణ్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఇన్‌స్పెక్టర్‌లు బుద్దెస్వామి, నరేష్, ఐటీ కోర్ రాము, సిబ్బంది నరేష్‌లను సీపీ ఈ సందర్భంగా అభినందించారు.