ఆదిలాబాద్ జిల్లాలోని పురపాలికల్లో 105 మంది శాశ్వత, 527 మంది తాత్కాలిక కార్మికులు పనిచేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ పురపాలికల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ పరికరాలు అందించినా చాలా చోట్ల కార్మికులు వాటిని వినియోగించడం లేదు.
పంపిణీ చేయాల్సిందిలా..
నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు చేతులకు గ్లౌజులు, నోటికి కట్టుకునేందుకు మాస్క్‌లు, కాల్వల్లో దిగి పూడికతీత చేపట్టే సమయంలో కాళ్లకు బూట్లు, గన్‌షూ, రహదారులను శుభ్రపరిచే వారికి రేడియం స్టిక్కరింగ్‌తో కూడిన ఆఫ్రాన్లను పంపిణీ చేయాలి. వర్షాకాలంలో రెయిన్‌కోట్లను సైతం పంపిణీ చేయాల్సి ఉంది. వీటితో పాటు నిత్యావసర వస్తువులను ఇవ్వాల్సి ఉంది. వీటిల్లో పురుషులకు రెండు జతల దుస్తులు, చెప్పులు, కొబ్బరినూనె, మంచినూనె, సబ్బులు, కండువాలు, మహిళా కార్మికులకు చీరలు, జాకెట్ పీసులు, కండువాలు ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఈ ప్రక్రియ అంతటా మొక్కుబడిగా సాగుతోంది.
బాధ్యత వారిదే..
కార్మికులు రక్షణ సామగ్రి ధరించకుండా విధుల్లోకి వస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పారిశుద్ధ్య అధికారి, సంబంధిత జవానుపై ఉంటుంది. రక్షణ సామగ్రి లేకుండా విధుల్లోకి తీసుకోరాదన్న నిబంధన కూడా ఉంది. క్షేత్ర స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. కార్మికుల ఆరోగ్యం కంటే పని పూర్తిచేయడంపై దృష్టిసారించి ఇష్టాను సారంగా విధులు చేయిస్తున్నారు. కార్మికులు భద్రత పాటించకుండా పనులు చేపట్టడంతో తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.