కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో తెల్లవారిజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలో శ్రీ హరిహర క్షేత్రంలో తెల్లవారు జామున భక్తులు కార్తిక దీపాలు వెలిగిస్తూ.. స్వామివారిని దర్శించుకున్నారు. కార్తిక మాసం 3వ సోమవారం కావడం వల్ల భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జిల్లాలోని ఆలయాలు కార్తిక దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.
కార్తిక పౌర్ణమిని సందర్భంగా దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలోకి కార్తిక దీపాలను వదిలారు. అనంతరం గూడెం గుట్టపై వెలసిన సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. దంపతులు సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కార్తికమాస పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ