కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే నేటికీ ఎంతో మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం రెండు రోజుల క్రితం అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు రవి కుటుంబాన్ని పరామర్శించారు.
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆదాయం లేక, అప్పులు చెల్లించలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎల్ రమణ అన్నారు. మరో రవి లాంటి కార్మికుడు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిని కాపాడుకుందామని పేర్కొన్నారు. తొందరపడి ఎవరూ బలవన్మరణానికి పాల్పడవద్దన్న ఆయన ఈ సమస్యను పోరాడి సాధించుకుందామని వారిలో ధైర్యం నింపారు. వ్యవసాయ రంగానికి రైతుబంధు, రైతు బీమా లాగా చేనేత కార్మికులకోసం కూడా ఏదైన ప్రత్యేక పథకాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషిచేయాలని కోరారు.
ఇదీ చదవండి: పవర్ ప్లాంట్ ప్రమాదంలో కూలీ మృతి.. బాధిత కుటుంబం ఆందోళన