Rythu Vedika: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతువేదికల అసలు లక్ష్యం నెరవేరడం లేదు. రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉండేందుకు, సమకాలీన సాగు అంశాలపై ఎప్పటికప్పుడు రైతులతో సమావేశమయ్యేందుకు వీలుగా ప్రతి వ్యవసాయ క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతువేదికల్ని నిర్మించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతువేదికల వినియోగం ఒక్కోచోట ఒక్కోలా ఉంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని రైతువేదిక ఇప్పటికీ పూర్తి కాలేదు. చుట్టూ ప్రహరీ నిర్మించిన గుత్తేదారు లోపల భవన నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. విద్యుత్, మంచినీరు, సామగ్రి ఇంకా సమకూరలేదు. పక్కనే ఉన్న మంగనూరు రైతువేదిక సైతం ఇదే పరిస్థితి. అసంపూర్తి పనులతో రైతువేదికలు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు.
వసతుల లేమి..
No use of Rythu Vedika: భవన నిర్మాణాలు పూర్తైన రైతు వేదికలైనా సరిగ్గా వినియోగంలో ఉన్నాయా అంటే అదీ లేదు. చాలా రైతువేదికలకు నీటి సౌకర్యం కల్పించలేదు. ఈ కారణంగా అప్పటికే నిర్మించిన మూత్రశాలలు సైతం నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి రైతువేదికకు నీటి సౌకర్యం లేదు. తిమ్మాజిపేట మండలం గుమ్ముకొండ రైతువేదికను చెరువుకు సమీపంలో నిర్మించారు. చెరువు నిండితే నీళ్లు రైతువేదికను ముంచెత్తడం ఖాయం. మౌలిక వసతులేమీ లేవని, మందుబాబులకు సైతం అడ్డాగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు.
'రైతు వేదికలు పూర్తయి రోజులు గడుస్తున్నాయి. కుర్చీలు, బల్లలు, బాత్రూమ్లు అన్ని ఏర్పాటు చేశారు.. కానీ నీటి వసతి కల్పించలేదు. దీంతో పాటు కొన్ని రైతు వేదికలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. దీంతో పంచాయతీల పరిధిలోని గ్రామస్థులు ఇక్కడకు రాలేకపోతున్నారు. నిర్వహణలేమితో రాత్రివేళల్లో రైతు వేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. సిబ్బంది కొరత కూడా రైతు వేదికల నిర్వహణ లోపానికి కారణమవుతోంది. రూ. లక్షలు ఖర్చు పెట్టి అన్నదాతల కోసం వేదికలు కట్టారు.. కానీ సరైన వసతులు, సదుపాయాలు లేక నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.'
- స్థానికులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
నిర్వహణ ఖర్చుల కొరత..
స్థలాభావం వల్ల ఊరికి దూరంగా నిర్మించిన రైతువేదికలకు వెళ్లేందుకు రైతులు, అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. బిజినేపల్లి మండలం వట్టెం రైతువేదికను ఊరికి దూరంగా నిర్మించారు. ఈ క్లస్టర్ పరిధిలో ఐదారు గ్రామాల రైతులుండగా వాళ్లు రైతువేదిక వద్దకు రాలేకపోతున్నారు. మహిళా వ్యవసాయ విస్తరణాధికారులు ఒంటరిగా రైతువేదికల్లో ఉండేందుకు భయపడుతున్నారు. ఆగమేఘాల మీద రైతువేదికల్ని నిర్మించిన ప్రభుత్వం... వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా రూ. 2 వేలు నిర్వాహణ ఖర్చుల కింద ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. రైతులతో జరిపే సమావేశాలకు సైతం ప్రభుత్వం నుంచి పైసా చెల్లించడం లేదని సమాచారం.
సిబ్బంది అవసరం...
రైతువేదికల నిర్వహణ కోసం కిందిస్థాయి సిబ్బంది అవసరమని ఎక్కువమంది వ్యవసాయ విస్తరణాధికారులు అభిప్రాయపడుతున్నారు. పంటల నమోదు, రైతు వేదిక నిర్వహణ సహా ఇతర పనుల్లో వ్యవసాయ విస్తరణాధికారుల పరిధిలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదిక సద్వినియోగంపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మౌలిక వసతుల కల్పనతో పాటు నిర్వహణ ఖర్చులు, కిందిస్థాయి సిబ్బంది నియామకం చేపట్టి... రైతువేదికల్ని వినియోగించుకోవాలని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి: Medaram Jatara 2022: వనదేవతల పండుగ.. మేడారం మహా జాతరకు ముమ్మర ఏర్పాట్లు