కొవిడ్ నివారణలో అధికారులంతా మానవతా దృక్పథంతో పని చేయాలని... మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 250 పడకల ఆసుపత్రిని మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిందని, వారం రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పడకల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఫంక్షన్ హాళ్లను గుర్తించి అవసరమైన పడకలు, ఆక్సిజన్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, వైద్యారోగ్యశాఖ అధికారులతో... మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
బతుకుతామనే భరోసా రావాలి...
మహబూబ్‌నగర్‌కు వెళితే బతుకుతామనే భరోసా ప్రజల్లో రావాలని, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సైతం అలాగే పని చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యులతో పాటు, అవసరమైతే ప్రైవేటు డాక్టర్లను నియమించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్యసేవలు, పడకలు ,ఆక్సీజన్ నిలువలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణకు సంబంధించిన సమస్యలను తొలగించి... పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి పేర్కొన్నారు.
చర్యలు తప్పవు...
ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ మానవతా దృక్పథంతో పనిచేసి విపత్తు నుంచి బయటపడేందుకు సహకరించాలని... జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఏదైనా ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే... డిజాస్టర్, ఎపిడేమిక్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ ,రెమ్‌డెసివర్‌కు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నిల్వ ఉండేలా చూసుకుంటున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: 'నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి పూర్తి భద్రత'