మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. కరోనా వార్డు, కొవిడ్ పరీక్షలు నిర్వహించే విభాగాన్ని, ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందితే ఎలాంటి ప్రాణాపాయం ఉండదన్నారు.
మరో 250 పడకలు
కొవిడ్ నుంచి కోలుకున్న రోగులతో మంత్రి మాట్లాడారు. చికిత్స ఇతర వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మంచి సేవలందిస్తున్నారని భోజనం బాగా ఉందని కరోనా నుంచి కోలుకున్న రోగులు మంత్రికి తెలిపారు. జిల్లాలో గత సంవత్సరమే సుమారు 300 పడకలతో కొవిడ్ వార్డు ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో మరో 250 పడకలను పూర్తి ఆక్సిజన్‌తో సహా ఏర్పాటు చేయనున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
ఇంటికే మందులు
మూడు సంచార అంబులెన్స్ క్లినిక్‌లను కరోనా కోసం ఏర్పాటు చేశామని వాటి ద్వారా మందులను ఇంటికే పంపిస్తామని, డాక్టర్లు, సిబ్బందిని కూడా ఇందుకు ప్రత్యేకంగా నియమించామని, వివరించారు. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు వారి ప్రాణాలు వారు కాపాడుకునేందుకు ప్రభుత్వం సూచనలు, సలహాలు పాటించాలన్నారు. జిల్లాలో కరోనా నివారణ కోసం డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. జిల్లా ఆస్పత్రితో పాటు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ల్లో కూడా బెడ్లు, ఇతర సౌకర్యాలున్నాయని తెలిపారు. మంత్రి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ఉన్నారు.
ఇదీ చదవండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి