సీజనల్ వ్యాధుల నివారణ కోసం మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు.
వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పైనా శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.
కరోనాకు మందు లేదని.. ముందు జాగ్రత్తే శ్రీరామ రక్ష అని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రమాదమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండొద్దని విజ్ఞప్తి చేశారు.