కాళ్లకు ట్యాగ్ కట్టిన ఓ పావురం ఓ తండాలో ప్రత్యక్షమైంది. తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ శివారు కేవుల తండాలో చోటుచేసుకుంది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ పావురం ఊరంతా తిరుగుతూ చివరికి ఓ ఇంటి ముందు వాలింది. ఇది గమనించిన ఓ యువకుడు పట్టుకోబోగా ఎగిరిపోయింది. మళ్లీ వచ్చి వాలగానే వెంటనే పావురాన్ని పట్టుకున్నాడు. అది సాదా సీదా పావురం కాదు.
పావురాన్ని పరిశీలించగా.. కాళ్లకు రెండు వైపులా రింగులు తొడిగి ఉండటం వల్ల ఆందోళనకు గురయ్యాడు. కాళ్లకు ఉన్న రింగులపై జియో కోడ్ నంబర్లు కనపడటం... ఆ నంబర్‌కు కాల్ చేయగా చెన్నైలో పందేలకు సంబంధించిన పావురమని తేలింది. పావురాల గుంపులో నుంచి ఇది దారి తప్పి అక్కడకు వచ్చి ఉంటుందని చెప్పారు. గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామంలోని విద్యార్థులు పావురాన్ని వింతగా చూశారు. పావురంతో గ్రామస్థులకు జబ్బులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేయగా.... పావురాన్ని పట్టుకున్న యువకుడు మాత్రం వారి మాటలు లెక్క చేయక... పావురాన్ని సాదుకుంటానని చెబుతున్నాడు.
ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత