ఒకవైపు వైద్యానికి చేసిన అప్పులు.. మరోవైపు నెల వారి మందుల కొనుగోలుకు డబ్బులు లేని దుస్థితి.. వెరసి ఆ కుటుంబాన్ని దీనానవస్థలోకి తోశేశాయి. మంచానికే పరిమితమైన తన కుమారుడికి సపర్యలు చేస్తూ.. తనకు వచ్చే పింఛన్తో నెట్టుకొస్తున్నాడు ఆ తండ్రి.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన గందసిరి యాకయ్య-సువర్ణ దంపతులకు కార్తిక్, యామిని సంతానం. 2014లో సువర్ణ మృతి చెందారు. ఇంటర్ పూర్తిచేసిన కార్తిక్ కుటుంబానికి అండగా నిలవాలని.. పైచదువులకు వెళ్లకుండా ఆటో కొని నడుపుతున్నాడు. 2018లో ఓ రాత్రి దంతాలపల్లి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొట్టడం వల్ల తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు.
చికిత్సతో కోమా నుంచి బయటపడినప్పటికీ... ఉదర భాగం నుంచి కాళ్ల వరకు శరీరం పూర్తిగా చచ్చుబడి పోయింది. వైద్యం కొనసాగించలేక మందులు కొనలేక యాకయ్య అవస్థలు పడుతున్నాడు. గతంలో హైదరాబాద్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వైద్య ఖర్చులకు రూ.20 వేలు అందించింది. రెండు సార్లు ప్రయత్నం చేసినా వైకల్య పింఛన్ మంజూరు కాలేదని యాకయ్య వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
ఇదీ చూడండి: కేయూ విద్యార్థి సునీల్ నాయక్ది ప్రభుత్వ హత్యే: రేవంత్