కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్ గొంది మారుమూల గ్రామానికి చెందిన అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ మడావి కన్నీబాయి.. హిమాలయ పర్వతారోహణ బృందానికి నాయకురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఎంపికపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. తమను గుర్తించి ఈ అరుదైన అవకాశం ఇచ్చినందుకు ఆదివాసీ సమాజం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
దేశ చరిత్రలోనే మొదటిసారి
హిమాలయాల శ్రేణి పంగార్చుల్ల పర్వతారోహణకు తెలంగాణ నుంచి ఎంపికైన ఇరవై ఎనిమిది మందికి బృంద నాయకురాలిగా ఆదివాసీ బిడ్డ కన్నీబాయి ఎంపికయ్యారు. ఆమె నియామకంపై రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపకుడు రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. దేశ చరిత్రలోనే హిమాలయాల పర్వతారోహణకు ఆదివాసీ ఎంపిక కావడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. దేశంలోనే ఈ జిల్లాకు గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా చంద్రకళ ఎంపిక