కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వారి చెరలో చెక్కకుండా పులి ముప్పుతిప్పలు పెడుతోంది. ట్రాకర్లు, అటవీశాఖ అధికారులు సహా దాదాపు 150 మంది అన్నిరకాల ఏర్పాట్లతో పులి ఉన్న ప్రాంతాన్ని దిగ్బంధించి ఐదు రోజులైనా చిక్క లేదు. దీంతో తాజాగా తెలంగాణ అటవీ సిబ్బందికి తోడుగా పెద్దపులిని పట్టుకోవడంలో నైపుణ్యం ఉన్న మహారాష్ట్ర అటవీశాఖకు చెందిన ర్యాపిడ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
కనిపించినా.. మత్తు ఇవ్వలేక
ఈ నెల 11వ తేదీన కంది భీమన్న అటవీప్రాంతంలో ఓ పశువుని పులి చంపింది. మరుసటిరోజే అటవీఅధికారులు రంగంలోకి దిగారు. ఆ మాంసాన్ని తినేందుకు మరోసారి వచ్చే అవకాశం ఉండటంతో అతి సమీపంలో 15 అడుగుల ఎత్తుతో కాపుకాశారు. మహారాష్ట్ర ర్యాపిడ్ రెస్క్యూ బృందానికి చెందిన ఇద్దరు వెటర్నరీ వైద్యులు సహా మరో ఇద్దరు అప్పట్నుంచి అక్కడే నిరీక్షిస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో చంపిన పశు మాంసాన్ని తినేందుకు మరోసారి పులి వచ్చినప్పటికీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు పులిపై మత్తుమందు ప్రయోగించకూడదనే జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ(ఎన్టీసీఏ) నిబంధనలుండటంతో మత్తు సూదిని వేయలేకపోయినట్టు సమాచారం.
‘చీకట్లో మత్తు మందు ప్రయోగించినా వెంటనే దాన్ని బంధించలేం. మత్తు ప్రభావం చూపడానికి 15 నిమిషాలు పడుతుంది. ఆ లోపు అది ఎక్కడికి వెళుతుందో గుర్తించడం సాధ్యం కాదు. లైట్లతో వెళ్లి దాన్ని జాడ పట్టుకునేలోపు మత్తు ప్రభావం తగ్గితే దాడిచేసే ప్రమాదం ఉంది. అందుకే అవకాశం చిక్కినా పట్టుకోలేకపోయాం’ అని ఆ బృందంలోని సభ్యుడు ఒకరు వివరించారు.
- ఇదీ చూడండి : అచ్చం పులిలా ఉంది.. ఊరందరిని భయపెట్టింది..