కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది కార్మికులు ఎస్పీఎం పరిశ్రమలో పని చేస్తున్నారు. లాక్డౌన్ మొదలయినప్పటి నుంచి తాము ఇక్కడే చిక్కుకుపోయామని తెలిపారు.
లాక్డౌన్ సమయంలో కూలీ చెల్లిస్తామని మొదట్లో చెప్పి, ఇప్పుడు కేవలం భోజన ఛార్జీలు మాత్రమే ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీల తరలింపు మొదలైనప్పటి నుంచి... అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని గోడు వెల్లబోసుకున్నారు.
వేరే ప్రాంతాల్లో వలస కూలీలను, కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపిస్తుంటే... తమను మాత్రం అధికారులు అనుమతించడం లేదని వాపోయారు. ఎలాగైనా తమను స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.