కుమురంభీం జిల్లా దహేగం మండలం దిగిడ గ్రామంలో పులి దాడిలో మృతి చెందిన విగ్నేష్ కుటుంబ సభ్యులను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా ఇంఛార్జి ఎస్పీ, రామగుండం కమిషనర్ ఆదిలాబాద్ సి.ఎఫ్. తదితరులు పరామర్శించారు. గురువారం అధికారులు విగ్నేష్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. ఘటన జరిగిన తీరును ఫారెస్ట్ అధికారులను.. సిపి సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మృతుని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఘటన నుంచి తప్పించుకున్న బాలుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల నగదు అందజేస్తామని, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
సీఎఫ్. వినోద్ కుమార్, సిపి సత్యనారాయణ పులి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతం కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నప్పటికి ఎప్పుడూ మనుషులపై దాడి చేయలేదన్నారు. ఈపులి కొత్తగా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోకి వచ్చుంటుందని అభిప్రాయపడ్డారు. దాడి చేసిన పులిని బంధించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: వ్యక్తిపై పెద్దపులి దాడి.. రాష్ట్రంలో ఇదే తొలిసారి!