మహారాష్ట్ర నుంచి తిరిగివచ్చిన ఏ2 పులి సరిహద్దుల్లోని పెంచికల్‌పేట మండలం కమ్మర్‌గాం అడవుల్లో సంచరించింది. మూడు పశువుల్ని చంపేసింది. అక్కడి నుంచి దహేగాం మండలం దిగిడకు.. అటు నుంచి రాంపూర్ అడవుల్లోకి వెళ్లింది. దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ ఇటీవల బెజ్జూరు మండలం కందిభీమన్న అటవీప్రాంతంలో చేసిన ప్రయత్నాలు ఫలించని విషయం తెలిసిందే. ఈ అలికిడితో మహారాష్ట్ర వైపు వెళ్లిన ఆ పులి.. దిగిడతోపాటు, సమీపంలోని రెండు ఆడపులుల తోడు కోసం మళ్లీ తిరిగివచ్చిందని దాన్ని పట్టుకునేందుకు ఇటీవల ప్రయత్నించిన బృందంలో సభ్యుడు ఒకరు తెలిపారు. ఆడపులిని అన్వేషిస్తూ ఏ2 రోజుకో ప్రాంతంలో తిరుగుతోందన్నారు.
ఏ2ను వెంటనే బంధించాలి
పులుల సంఖ్య పెరిగినప్పుడు ఆవాసం, ఆధిపత్యం కోసం జరిగే పోరులో బలంగా ఉన్నవి మిగిలినవాటిని తరిమేస్తాయి. ఓడిన చిన్నపులులు, వయసు మళ్లినవి కొత్త ఆవాసాన్ని వెతుక్కుంటూ వెళతాయి. ఆవాసం, రోజుల తరబడి ఆహారం దొరకనప్పుడు ఆ పులులు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తాయి. అవి ముందు పశువుల్ని, తర్వాత మనుషుల్ని చంపుతాయి. అలాంటి పరిస్థితిలోనే అవని నర భక్షకి(మ్యాన్‌ఈటర్)గా మారి 13 మందిని బలిగొంది. అదే తరహాలో ఏ2 పులి దాడులూ ఉన్నాయి. దీన్నిబట్టిచూస్తే దాని మానసికస్థితి దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. దాన్ని ఆలస్యం చేయకుండా బంధించాలి.
-నవాబ్ షఫత్ అలీఖాన్, వైల్డ్‌లైఫ్ ట్రాంక్యూఫోర్స్ ఎన్జీవో