నిత్యం మొక్కలకు నీరు పట్టడం, సేంద్రియ ఎరువు తయారు చేసి పిచికారీ చేస్తూ వాటిని చిన్నపిల్లల్లా పెంచుతున్నారు. ఇళ్ల ఆవరణలో పూలు, పండ్లు, అలంకరణ, ఔషధ, కూరగాయలు.. ఇలా విభిన్న రకాల మొక్కలతో ఆహ్లాదభరితంగా మార్చేసి పచ్చదనం పెంపొందిస్తున్నారు. మొక్కలను కుండీల్లోనే కాకుండా ఖాళీ ప్లాస్టిక్ నూనె డబ్బాలు, వాడిన బకెట్లు, ఇతర డబ్బాలను వివిధ ఆకారాల్లో కత్తిరించి కుండీలుగా మలిచి మొక్కలు పెంచుతున్నారు. బ్యానర్‌లను కూడా సంచుల్లా కుట్టి మట్టి నింపి మొక్కలు పెంచుతున్నారు.
పచ్చదనంతో స్వాగతం:
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ వద్ద నివాసముంటున్న ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి గుండా శంకర్ తన ఇంటి ఆవరణను హరితవనంలా మార్చేశారు. ఇంటికి రెండు వైపులా కంచె ఏర్పాటు చేసి చుట్టూ విభిన్న రకాల మొక్కలు పెంచుతున్నారు. పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, కలకత్తా పాన్‌ఆకుల మొక్కలు, ఇండోర్, అవుట్‌డోర్ ఇలా.. 90 రకాలకు పైగా పెంచుతున్నారు. ఆరోగ్యం కోసం తను పెంచుతున్న ఔషధ మొక్కల్లో నిత్యం ఒక్కో మొక్క ఆకును తినడం అలవర్చుకున్నట్లు హరిత ప్రేమికుడు శంకర్ చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంటి పరిసరాల్లో ఏ మొక్క ఎక్కడ ఉండాలన్నది తెలుసుకొని పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సొంతంగా ప్రయోగాలు:
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న మనీష మొక్కలు పెంచడంపై చిన్నతనం నుంచే మక్కువ. కొత్తగా ఏ మొక్క కనిపించినా తీసుకువచ్చి ఇంటి వద్ద నాటుతుంది. ఇలా.. అన్నిరకాల పూలు, పండ్ల మొక్కలు నాటారు. వివిధ రకాల కూరగాయలు సైతం పెంచుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మొక్కల అంటుగట్టే విధానం పరిశీలించి సొంతగా ప్రయోగాలు చేస్తున్నారు. మందారం మొక్కను అంటుగట్టి గులాబి, లేత గులాబి, తెలుపురంగు పూల మొక్కలను సృష్టించారు. ఇంటి ఆవరణలో సుమారు 80 రకాలకు పైగా మొక్కలు కనువిందు చేస్తున్నాయి. మొక్కలంటే ప్రాణమని.. అవి ఇంటికి అందాన్ని, మనుషులకు ఆరోగ్యాన్ని పెంచుతాయని అంటున్నారు మనీష.
ఇంట్లోనే చిట్టడవి:
రెబ్బెన మండలం గోలేటికి చెందిన గుర్రం అమృత ఇంటి ఆవరణలో చిట్టడవిని సృష్టించారు. భర్త గంగయ్య సింగరేణి ఉద్యోగి. మొక్కల పెంపకాన్ని అమితంగా ఇష్టపడే అమృత ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలే కాకుండా కొత్తిమీర, మెంతి, ఇతర పూలమొక్కలు పెంచుతున్నారు. ఇంటి ఆవరణంతా పచ్చదనంతో నిండిపోవడంతో నిండు వేసవిలోనూ చల్లగా ఉంటుంది. ఏటా సింగరేణి వారు నిర్వహించే పర్యావరణ గృహ సందర్శనలో ఇప్పటి వరకు 15 సార్లు మొదటి స్థానం, ఇటీవల రెండో బహుమతి పొందారు. గతంలో సింగరేణి స్థాయిలో కూడా ఉత్తమ స్థానంలో నిలిచి బహుమతి పొందారు. పండ్లు, పూలు, ఆకు కూరలు.. నిత్యం వినియోగించే వాటిని నాటుకోవడం ద్వారా ఏది అవసరమైతే అది వెంటనే కోసుకోవచ్చని చెబుతున్నారు అమృత.
ఇదీ చదవండి: బైడెన్ బృందంలో మరో భారత సంతతి మహిళకు చోటు