ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నిల్వ ఉంచిన మిరప ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.12,900 పలికింది. గిడ్డంగుల్లో అయితే రూ.13,000కు ఎగబాకింది. గత ఏడాది సీజన్ నుంచి ఇప్పటి వరకు అత్యధిక ధర పలకడం విశేషం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు విక్రయించేటప్పుడు కనీస మద్దతు ధర కరవవ్వగా గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కర్షకులు నష్టాలను చవిచూశారు.
జనవరి నెల నుంచి మే వరకు రూ.9,000 నుంచి రూ.11,000 మధ్యనే ధర పలికింది. ఈ సమయంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు 8,35,156 క్వింటాళ్ల మిరపను విక్రయించారు. రైతులు డిసెంబరు నుంచి మే వరకు శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకుంటే వ్యాపారులు తమ నిల్వలను ఏప్రిల్‌లో నిల్వ ఉంచుకున్నారు.
పెరుగుతున్న ధరలు
ఈ ఏడాది జూన్ మొదటివారంలో వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభించిన తర్వాత ఏసీ మిర్చి క్వింటా ధర రూ.11,000 నుంచి రూ.12,300 మధ్య చాలా రోజులు ధర స్థిరంగా ఉంది. సోమవారం మాత్రం ఒక్కసారిగా ధర పెరగటం విశేషం. ధరలు పెరుగుతున్నందున నగరంలో శీతల గిడ్డంగులు ప్రతి రోజు వ్యాపార లావాదేవీలతో కళకళలాడుతున్నాయి. ఏసీల్లో నిల్వ ఉంచుకున్న రైతులు తమ సరుకును విక్రయించుకుంటున్నారు. అయితే వీరి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే పెరిగిన ధరల వల్ల వ్యాపారులకే ఎక్కువ ప్రయోజనం జరిగింది. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మాత్రం అప్పులే మిగిలాయి.
విదేశాల నుంచి ఆర్డర్లు
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వచ్చే సీజన్ ఆశాజనకంగా కనిపించకపోవడం వల్ల ఇప్పుడు మిరప ధరలు పెరగాయని భావిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రధానంగా కోల్‌కతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వ్యాపారులు మిరప ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అక్కడ కూడా సరుకు లేదు. మరోవైపు చైనా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అందుకే మిర్చి ధర పెరిగిందని విశ్లేషకులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చదవండిః పల్లె నుంచి పట్టణానికి చేరుకోనున్న బ్యాలెట్ పెట్టెలు