పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి పచ్చదనం పెంపే లక్ష్యంగా పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా యజ్ఞంలా మొక్కలు నాటాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పచ్చదనం పెంపొందించేలా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ పూర్వ ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో హరితహారం నత్తనడకన సాగుతోంది. ఖమ్మం నగరపాలకంతోపాటు మరో 7 పురపాలికల్లోనూ లక్ష్యం లక్షల్లో ఉండగా...నిర్లక్ష్యంగా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాలకవర్గాలు, అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడం కారణంగా జిల్లాలోని పురపాలికలు కనీసం సగం శాతం లక్ష్యం చేరుకోలేదు.
పట్టణాల్లో నర్సరీలు అంతంతమాత్రమే
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరపాలకం, వైరా, సత్తుపల్లి, మధిర పురపాలికల్లో లక్షల్లో లక్ష్యం ఉన్నా నాటిన మొక్కలు మాత్రం వేలల్లోనే ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలూ ఉన్నాయి. గ్రామాల్లో హరితహారం కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఉండటం కలిసి వస్తుంది. కానీ పట్టణాల్లో నర్సరీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి మొక్కలు తెచ్చి నాటడం పాలకవర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాకుండా పట్టణాల్లో అంతర్గత రహదారులన్నీ సీసీ రోడ్లు కలిగి ఉండటం కూడా ప్రతికూలంగా మారుతుంది. మొక్కలు నాటేందుకు స్థలాలు దొరకడం లేదు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నా...వాటికి సరైన సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదు.
లక్ష్యం లక్షల్లో... అమల్లో నిర్లక్ష్యం
పూర్వ జిల్లాలోని 8 పట్టణాల్లోనూ హరితహారం లక్ష్యం గతం కంటే రెట్టింపు ఉంది. గతంలో లక్ష్యం కంటే ఈ ఏడాది రెండింతలు, కొన్నిచోట్ల అయితే మూడింతల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఇది కూడా హరితయజ్ఞానికి ప్రతిబంధకంగా మారుతోంది. విరివిగా మొక్కలు నాటే సంకల్పంతో లక్షల్లో లక్ష్యం ఉన్నప్పటికీ... మొక్కలు నాటే పరిస్థితులు లేకపోవడం వల్ల పురపాలికలు చేతులెత్తేస్తున్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు నాటుతున్నాయి. మిగిలిన మొక్కలను భారీగా పట్టణ వాసులకు ఉచితంగా పంచిపెడుతున్నారు. వీటిని కూడా లక్ష్యం లో చేర్చుకుంటున్నాయి. కానీ వాటి సంరక్షణ బాధ్యతలను మాత్రం గుర్తెరగడం లేదు. పట్టణాల్లో ఇంటింటికీ 5 మొక్కలు పంచాలి. కానీ ప్రజలు అడిగే పండ్ల మొక్కలు అందుబాటులో లేకపోవడం వల్ల మొక్కలు తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో...స్థానికంగా ఉన్న పార్కులు, అటవీశాఖకు మొక్కలు అప్పగిస్తూ పురపాలికలు చేతులు దులుపుకుంటున్నాయి.
పురపాలిక చట్టం ప్రకారం...
పురపాలిక చట్టం ప్రకారం హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత పాలకవర్గాలే తీసుకోవాలి. ఇందుకోసం గ్రీన్ బడ్జెట్ పేరిట ప్రత్యేకంగా నిధులు కేటాయించి వినియోగించుకోవాలి. నగరాలు, పట్టణాల్లో మొక్కలు నాటడమే కాదు నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సంబంధిత అధికారులు, పాలకవర్గంపై చర్యలు తప్పవని పురపాలక చట్టం హెచ్చరిస్తుంది. దీంతో నాటిన మొక్కలను సంరక్షించాలనే కఠిన నిబంధనలు ఉండటంతో విరివిగా మొక్కలు నాటేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. కరోనా ప్రభావం వల్ల హరితహారం నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుకంజ వేస్తున్నారు.
సీజన్ దాటితే లక్ష్యం చేరుకోలేం:
ప్రస్తుతం సీజన్ హరితహారం కార్యక్రమానికి ఉపకరిస్తోంది. ఈ సమయంలోనే విరివిగా మొక్కలు నాటాలి. ప్రస్తుతం కురిసే వర్షాలకు బతుకుతాయి. సీజన్ దాటిన తర్వాత మొక్కలు నాటినా ఫలితం ఉండదు. అంతేకాదు రహదారులకు ఇరువైపులా, డివైడర్లపై మొక్కలు నాటుతున్నా వాటికి రక్షణ కన్పించడం లేదు. కనీసం ట్రీగార్డులు ఏర్పాటు చేయడం లేదు. సంరక్షణ చర్యలు ఏమీ చేపట్టకుండా లెక్కల్లో మాత్రం చూపిస్తున్నారు. ఇటీవల ఇల్లెందు పురపాలికలో డివైడర్లపై నాటిన మొక్కలు తిన్నాయన్న ఆరోపణలపై మేకలకు జరిమానా విధించిన అధికారులు మొక్కలసంరక్షణలో మాత్రం నిర్లక్ష్యం చూపుతుండటం గమనార్హం.
పురపాలిక | లక్ష్యం (లక్షల్లో) | నాటినవి | నాటిన శాతం |
ఖమ్మం నగరపాలకం | 1.65 | ||
వైరా | 2.02 | 17వేలు | 8.5 |
మధిర | 3.7 | 30వేలు | 17 |
సత్తుపల్లి | 2.14 | 10వేలు | 4.6 |
కొత్తగూడెం | 5.18 | 1.77 | 34 |
పాల్వంచ | 5.20 | 2.60 | 50 |
ఇల్లెందు | 2.19 | 1.20 | 54.7 |
మణుగూరు | 2.86 | 1.22 | 53.95 |
ఇవీ చూడండి: కరోనా చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆస్పత్రిపై చర్యలు