భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఆదివాసీ గ్రామం రామన్నపేట పరిధిలో 50 ఏళ్ల క్రితం నుంచే పట్టాలు ఉన్న భూములు తమకు అప్పగించాలని, సాగు చేసుకునే హక్కు కల్పించాలని స్థానిక గిరిజనులు మరోసారి గర్జించారు. సుమారు 50ఏళ్ల క్రితం రామన్నగూడెంలో 150 మంది గిరిజన రైతులకు 573 ఎకరాలకు సంబంధించిన పట్టాలు మంజూరు చేశారు. సుమారు 40 ఏళ్ల క్రితం ఆ భూముల్లో టేకు మొక్కలు వేస్తే అధిక ఆదాయం వస్తుందని చెప్పిన అటవీశాఖ అధికారులు.. మొత్తం టేకు మొక్కలు నాటించారు. ఆ తర్వాత క్రమంగా అధికారులు ఆ భూములు అటవీశాఖకు చెందినవంటూ.. అక్కడ అడుగు పెట్టనీయడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. భూములు తమకు కేటాయించాలని, భూముల్లో పంటసాగుకు అనుమతి ఇవ్వాలని గిరిజనులు 2011లో హైకోర్టును ఆశ్రయించారు. నాడు కోర్టుసైతం వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేశారు. 2014లో మరోసారి అటవీశాఖ అధికారులు కోర్టును ఆశ్రయించినప్పటికీ.. మరోసారి గిరిజనులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. సదరు భూమిని మాత్రం గిరిజనులకు అటవీశాఖ అప్పగించలేదు. ఇలా పోరాటాల్లోనే గిరిజనుల కుటుంబాల్లో ఒక తరం మారింది. ఇటీవల మళ్లీ ఆ భూములపై గిరిజనులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
ఏళ్లుగా పోరాటం చేస్తున్న తమ సమస్య పరిష్కారం కావడం లేదని భావించిన గిరిజనులు.. ఏకంగా ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారం రోజుల నుంచే సమాయత్తమవుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండ్రోజులుగా కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు గ్రామంలోకి వెళ్లి కొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఉదయం రామన్నగూడెం సర్పంచ్ స్వరూప ఆధ్వర్యంలో సుమారు 200 మంది గిరిజనులు రామన్నగూడెం నుంచి ప్రగతిభవన్‌కు పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 15కిలోమీటర్లు పాదయాత్ర సాగిన తర్వాత అశ్వారావుపేటకు సమీపంలో వాగొడ్డుగూడెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని విరమించుకోవాలని కోరగా.. గిరిజనులు మాత్రం వెళ్లితీరుతామని తేల్చిచెప్పారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు, గిరిజనుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు-గిరిజనుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గిరిజనులపై లాఠీలు ఝులిపించగా...ఆందోళనకారులు సైతం పోలీసులపై తిరగబడి ప్రతిఘటించారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం పిల్లలతో కలిసి పాదయాత్రగా బయలుదేరాం. అప్పటికే అశ్వారావుపేట శివారులో భారీగా పోలీసులు మొహరించారు. అసలు మేం శాంతియుతంగా చేస్తుంటే.. మాపై లాఠీఛార్జ్ చేశారు. చాలామందిని కొట్టారు. మా ఆదివాసీలను ఏడిపించడం సరికాదు. మా ఉసురు తగులుతుంది. బయటకు రాకపోతే.. చంపుతామని బెదిరించారు. మా భూములు.. మాకు హక్కు ఉంది. సర్వే నంబర్లు కూడా ఉన్నాయి. తలుపులు పగులుకొట్టి.... రచ్చ రచ్చ చేశారు. - గిరిజనులు
వాగొడ్డుగూడెం వద్ద గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక వాహనాల ద్వారా ముల్కలపల్లి తరలించారు. మార్గమధ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆందోళనకారులకు మద్దతుగా నిరసన చేపట్టారు. గిరిజనులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారుల్ని పోలీసులు భద్రాద్రి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుని భూములు తమకు అప్పగించాలని గిరిజనులు కోరుతున్నారు.
- ఇదీ చదవండి : ఆన్లైన్ రమ్మీకి బానిసై.. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య