మహిళలు, యువతులపై దాడులను అరికట్టడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా ఏవీ అఘాయిత్యాలను ఆపలేకపోతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఘటనలు చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాల దశలోనే ఆడపిల్లలకు అవగాహన పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం "వాయిస్ ఫర్ గర్ల్స్ " పేరుతో ప్రత్యేక కార్యక్రమాలతో విద్యార్థినులకు శిక్షణ ఇస్తోంది.
8,9 తరగతులు చదువుతున్న కౌమార దశలో బాలికలను గుర్తించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. అమ్మాయిలపై జరిగే అరాచకాలపై చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు, ప్రభుత్వం, పోలీసుల ద్వారా సహాయం, టోల్ ఫ్రీ నెంబర్లు, ఆడపిల్లలకు కల్పిస్తున్న చట్టాలు వంటి వాటిపై అవగాహన పెంచుతున్నారు. అకస్మాత్తుగా జరిగే దాడులు, వేధింపులను అలకోవగా ఎదురించడం వంటి వాటిపై పదిరోజుల్లో శిక్షణ ఇచ్చారు. ప్రదర్శనల్లో తోటి పిల్లలతో కన్నీరు పెట్టించే విధంగా నాటికలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాలో ఏన్కూరు, చింతకాని, కూసుమంచి, ఖమ్మం గ్రామీణం, కొణిజర్ల, కొత్త లక్ష్మీపురం, ఖమ్మం అర్బన్ మండలాల కేజీబీవీల్లో విద్యార్థునులను కలిపి 100 మందికి శిబిరంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణలో నేర్చుకున్న మెళుకువలను బాలికలు తమ విద్యాలయాల్లో తోటి పిల్లలకు నేర్పించడంపై కూడా తర్ఫీదునిచ్చారు. సాధారణ అంశాలయిన విద్య, ఆరోగ్యం, బాలికల హక్కులపై కూడా అవగాహన కల్పించారని బాలికలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల అమ్మాయిల్లో చాలా ధైర్యం వస్తుందని... ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకుంటారని పలువురు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మరిన్ని పాఠశాలల్లో కూడా ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి