ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మహా నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అలాంటి వ్యక్తిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇష్టమున్నట్లుగా అంటున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్‌లో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఊహించని పరిస్థితి నెలకొందని తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో తెలియదని మంత్రి అన్నారు. భాజపాలో ఎందుకు చేరాడో కూడా తెలియదని పేర్కొన్నారు. ఆ పార్టీలో ఎక్కువ రోజులు నిలువలేడని జోస్యం చెప్పారు.
తనకు తానుగానే ఈటల తెరాస నుంచి వెళ్లాడని, వ్యక్తి పోతే పార్టీకి నష్టం లేదన్నారు. వ్యక్తి ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని... ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని.... రానున్న ఉప ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పులతో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పోలీస్ హౌజింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: కుమార్తె చదువుకై.. తాను తడుస్తూ..