ఏ అండ లేకుండా ముగ్గురు మానసిక వైకల్యం గల పిల్లలతో ఓ తండ్రి పడుతున్న బాధపై ఈటీవీ భారత్లో వచ్చిన 'అవస్థలు పడుతున్నం.. ఆదుకోండి సారూ' అనే కథనానికి స్పందన వచ్చింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామ శివారులో ముత్యాల వెంకటమల్లుకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కవిత, సారవ్వ, చిన్న కుమారుడు నాగరాజు చిన్నతనం నుంచే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. వెంకటమల్లు మిగిలిన ముగ్గురు కుమారులు... వీరికి దూరంగా ఉంటూ తమ దారి వారు చూసుకున్నారు.
సరైన ఇల్లు లేదు..
పదేళ్ల క్రితం వెంకటమల్లు భార్య మృతిచెందడంతో... పూర్తి స్థాయిలో పిల్లల బాధ్యత అతనిపైనే పడింది. అప్పటి నుంచి గ్రామాశివారులో ఓ పూరి గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తనకు వచ్చే పింఛన్ డబ్బు, రేషన్ బియ్యంతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్న... తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. వృద్ధాప్య దిశలో ఉన్న తాను మరణిస్తే పిల్లలను చూసే దిక్కు ఉండరంటూ వెంకటమల్లు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఊరి చివర ఉండటం వల్ల.. విషపురుగులు, పాములు బెడద సైతం ఉంటుందని వాపోయాడు. సరైన ఇల్లు లేక చాలా అవస్థలు పడుతున్నామని తెలిపారు.
10వేల సాయం
వెంకటమల్లు దీన స్థితిపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి పలువురు స్పందించారు. హైకోర్టు న్యాయవాది గాలి చంద్రకళ వృద్ధుడి దీనస్థితికి చలించి తన వంతు సహాయంగా పదివేల రూపాయలను అందించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి శుక్రవారం కొండాపూర్ గ్రామంలో వెంకటమల్లు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించి, కుటుంబ పోషణ గురించి వృద్ధుడు వెంకటమల్లును ఆరా తీశారు.
పింఛన్లు వచ్చేలా చూడాలి
వృద్ధుడైన వెంకటమల్లును, మానసిక వైకల్యంతో ఉన్న ముగ్గురు పిల్లలను ఆదరించకుండా దూరంగా ఉంటున్న మిగతా ముగ్గురు కుమారులతో మాట్లాడి తండ్రిని తోడబుట్టిన వారిని చూసుకోవాలని వారిని కోరారు. వెంకటమల్లు కుటుంబ దీనస్థితిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వంగర మల్లేశం మానసిక వైకల్యంతో బాధపడుతున్న ముగ్గురు పిల్లలను సదరం శిబిరానికి తీసుకువెళ్లి పింఛన్లు మంజూరు అయ్యేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
ఇదీ చదవండి: కన్నీటి వేడుకోలు: 'అవస్థలు పడుతున్నం.. ఆదుకోండి సారూ'