Dengue Fever Karimnagar : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది మంది రోగులు ప్రభుత్వాసుపత్రికి వస్తుండటంతో వార్డులు కిటకిటలాడుతున్నాయి.. కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి ఆ తర్వాత వానలు లేకుండా పోయాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో జ్వరాల తీవ్రత పెరిగింది. డెంగీ దోమల కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. వందల సంఖ్యలో జ్వరపీడితులు ఆసుపత్రులకు వస్తుండగా వారికి కనీస సదుపాయాలు కరవయ్యాయన్న విమర్శలు వెలువెత్తులున్నాయి.
Seasonal Diseases : రాష్ట్రంలో వర్షాలు.. సీజనల్ వ్యాధుల పట్ల జరంత జాగ్రత్త!
Viral Fevers In Karimnagar : కరీంనగర్ జిల్లా సర్కారు ఆసుపత్రికి చిన్నాపెద్దా తేడాలేకుండా జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. రోగులకు సరిపడ మంచాలు లేకపోవటంతో వరండాల్లో పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. మరికొందరినీ పూర్తిగా తగ్గక ముందే డిశ్చార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 200 డెంగీ కేసులు వెలుగులోకి రాగా నిర్ధరణ కానీ కేసులు రెట్టింపులో ఉన్నాయి. మరోవైపు వైరల్ జ్వరాల కేసులు సైతం వందల్లో నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆస్పత్రుల్లో ఎవరినీ పలకరించినా ప్లేట్‌లెట్లు తగ్గాయని చెబుతున్నారు.
Dengue Fever Cases 2023 : సాధారణంగా రోజుకు 40 మంది వస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య 200కు పెరిగింది. దీంతో ఆస్పత్రి వార్డులన్నీ జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. పడకలు సరిపోక వరండాల్లో పడుకోబెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి రోగుల ఇబ్బందులు తప్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
'' ప్రజలు జ్వరంతో ఆస్పత్రికి వస్తే పడకలు సరిపోక వరండాల్లో పడుకోబెడుతున్నారు. 2015లో కరీంనగర్ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 పడకల ఆస్పత్రి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తానని చెప్పారు. గతంలో చెప్పిన మాటలు నెరవేర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.'' - నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు
సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవటంతో పాటు సమీప ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. జ్వరం రెండ్రోజుల కంటే ఎక్కువగా ఉంటే.. సొంత వైద్యం మాని.. వైద్యులను సంప్రదించాలని సూచనలు చేస్తున్నారు.
Dr Raja Rao Interview : 'గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే.. ఎంసీహెచ్ కేంద్రాలు'