Crop Damage in Karimnagar: కరీంనగర్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి పంట నేలకొరిగింది. యాసంగిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో పెద్దగా ఆసక్తి చూపని రైతులు.. వానాకాలంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా అమ్ముకోవడానికి వీలు ఉంటుందని పెద్దఎత్తున వరి పంటలు వేసుకున్నారు. కానీ వర్షాల ప్రభావానికి చేతికి వచ్చే పంట నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల పెట్టుబడి సాయం ఇచ్చినా.. తమకు మాత్రం రూ.35 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.
గతంలో వర్షాల వల్ల నష్టం కలిగినప్పుడు అధికారులు తమకు జరిగిన నష్టాన్ని రాసుకొని వెళ్లేవారని.. ఇప్పుడు రైతుబంధు వచ్చాక తమను పట్టించుకునేవారు లేరని చెబుతున్నారు. నేలకొరిగిన పంటను కాపాడుకునేందుకు ఎంత యత్నించినా ప్రయోజనం ఉండదని.. ధాన్యం నాణ్యత దెబ్బతిని ధర కూడా పలకదని రైతులు అంటున్నారు. పంట నష్టపోవడంతో తాము పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. రైతుల పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..
భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రహదారులు..
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఆక్సిజన్ సిలిండర్ల కారులో భారీ పేలుడు.. చెలరేగిన మంటలు