హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నిక వేడి తగ్గి... పండుగ వాతావరణం నెలకొంది. దసరా సందర్భంగా పార్టీల అభ్యర్థులు ప్రచారానికి విరామం ప్రకటించడం వల్ల నియోజకవర్గంలో పండుగ సందడి కనిపిస్తుంది (huzurabad by election campaign). ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. భాజపాలో చేరిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండిపోయారు. పాదయాత్రను మొదలుపెట్టిన ఈటల... ఆపరేషన్ కారణంగా మధ్యలోనే విరమించాల్సి వచ్చింది. అయినా ప్రజలను నిరంతరం కలుసుకుంటూ తన గుర్తు మారిందంటూ చెబుతూ వస్తున్నారు. అయితే బతుకమ్మ, దసరా సందర్భంగా మూడు రోజుల పాటు తమ ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించారు.
బ్రేక్ ఇచ్చిన తెరాస
నియోజకవర్గంలో తెరాస పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారాన్ని... అన్నీ తానై నడిపిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తన కార్యక్రమానికి విరామం ప్రకటించారు. గత నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన... దసరా సందర్భంగా ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు (huzurabad by election campaign). మరో మంత్రి గంగుల కమలాకర్... కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉండగా... మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ప్రచార తారలైన పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, చల్ల ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్ ప్రచారానికి కాస్త విరామం ప్రకటించారు. మరోవైపు తెరాస అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా ప్రచారానికి దసరా సెలవు ఇచ్చారు.
మిగిలింది అభ్యర్థులే
అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర బాధ్యులందరూ తమ ప్రాంతాలకు వెళ్లిపోగా ఒకరిద్దరు నాయకులు నియోజకవర్గంలో పర్యటించారు. భాజపాకు చెందిన ఇంఛార్జిలు కూడా వెళ్లిపోయారు. కొంతమంది నాయకులు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అంతగా ప్రచార హోరు మాత్రం కనిపించలేదు. స్థానికంగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాత్రమే ఉండిపోయారని చెప్పాలి (huzurabad by election campaign). కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ గురువారం ప్రచారం నిర్వహించినప్పటికీ ఆ తర్వాత ప్రచారంలో కనిపించలేదు. బల్మూరి వెంకట్‌తో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. నిరంతరం ఇంఛార్జ్‌లు, మంత్రులతో హడావుడిగా కనిపించిన అభ్యర్థులు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే దసరా పండగ అనంతరం ప్రచారాన్ని పూర్తి స్థాయిలో వేడెక్కించేందుకు సిద్ధవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తగ్గిన హారన్ల మోత
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రకటన రాక ముందే కార్ల హారన్ల మోతలు, వీఐపీల కాన్వాయ్‌లతో కిక్కిరిసి పోయింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు దళితబంధు సర్వే కోసం అధికారుల పర్యటనలు, సర్వేలతో సందడిగా ఉన్న హుజూరాబాద్... షెడ్యూల్ తర్వాత ఎన్నికల అధికారుల హడావుడి మరింత పెంచింది. నిరాటంకంగా సాగిన ప్రచార హోరుతో సందడి సందడిగా ఉన్న హుజూరాబాద్ గత రెండు రోజులుగా సైలెంట్ అయిపోయింది (huzurabad by election campaign).
సద్దుల బతుకమ్మ, విజయ దశమి వేడుకల పుణ్యమా అని హుజూరాబాద్‌లో తాత్కాలిక బ్రేకు పడింది. ఉప ఎన్నికల కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంతో దద్దరిల్లిపోతున్న ప్రజలకు కాస్తా ఉపశమనం దొరికినట్టయింది. అయితే కొంత మంది మాత్రం ఇది తుపాను ముందు ప్రశాంతతలా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు (huzurabad by election campaign).
ఇదీ చూడండి: Liquor Sales in Huzurabad : అక్కడ మద్యం ఏరులై పారుతోంది.. భారీగా పెరిగిన అమ్మకాలు