Sharmila Fires On Telangana Government: తహసీల్దార్ దగ్గర పరిష్కారం అయ్యే సమస్యను ధరణి తెచ్చి రైతులు కలెక్టర్ దాకా వెళ్లేలా చేశారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధరణి పేరు చెప్పి రికార్డ్లను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. రూ.5 వేలు రైతు బంధు ఇస్తే రైతులు ఎలా కోటీశ్వరులు అవుతారని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అయినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు లేకపోవడం దారుణమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పెన్షన్ అని చెప్పి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. 13లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రేషన్ షాపుల్లో అన్ని బందు పెట్టి కేవలం దొడ్డు బియ్యం ఇస్తున్నారని విమర్శించారు. ఏడాదిలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని అక్కడి ప్రజలకు వైఎస్ షర్మిల సూచించారు.
"57సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని అన్నారు ఇస్తున్నారా. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఇస్తున్నారు. మరి గొప్పగా ఇంటి పెద్ద కొడుకని కేసీఆర్ చెబుతున్నారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి. ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కాదు. రైతులను, ఉద్యోగులను, ఆదుకునే ప్రభుత్వం కాదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎరువులకు సబ్సిడీ, విత్తనాలకు సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం అయితే సబ్సిడీ ఇచ్చేవారు. అంటే రూ.30వేల పథకాలు రైతులకు ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని బంద్ పెట్టి రూ.5వేలు ఇచ్చి రైతులను కోటీశ్వరులను చేస్తున్నామని కేసీఆర్ అంటున్నారు అందులో వాస్తవం ఉందా." - వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు
ఇవీ చదవండి: కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో సురేష్ షెట్కార్ వర్సెస్ సంజీవ్ రెడ్డి