రైతుల కష్టాలను తెలుసుకునేందుకు కల్లాలలోకి కాంగ్రెస్ పేరుతో నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth reddy on paddy procurement) కామారెడ్డి జిల్లాలోని బస్వాపూర్, రామేశ్వరంపల్లి, కామారెడ్డి, భవానీపేట, పల్వంచ, లింగంపేట, నల్లమడుగులలోని... ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అన్నదాతలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి అనేక అవస్థలు పడుతున్నా.... ప్రభుత్వం కొనడం లేదని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. రంగు మారిన ధాన్యాన్ని రేవంత్‌కు చూపించి ఆవేదన వ్యక్తంచేశారు.
మద్యం టెండర్ల డబ్బులతో..
కామారెడ్డి మార్కెట్ యార్డులో రెండుసార్లు ధాన్యం తడిసినా... అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. సాగుదారులతో పెట్టుకున్నవారు బాగుడపడినట్లు చరిత్రలో లేదని రేవంత్(Revanth reddy on paddy procurement) దుయ్యబట్టారు. నెలరోజులుగా ధాన్యం కొనకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయంతోనైనా ధాన్యం కొనుగోలు చేసి కర్షకులకు ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలవుతోందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల చేతిలో ఉరి తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు
ధైర్యం నింపేందుకు..
"ధాన్యం అమ్ముకునేందుకు రైతులు వరి కుప్పల పైనే పడుకుని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. రైతుల గురించి ఆలోచించకుండా ధర్నాల పేరిట కాలయాపన చేస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిపోతోంది. ప్రతి గింజా నేనే కొంటా అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరి తప్పదు. పార్లమెంటులో ప్రధాన మంత్రిని నిలదీసి వరి పంటను కొనేలా చేస్తాం. పంట నీటిపాలై రైతులు దుఃఖంలో ఉన్నారు. రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నాం. వారి సమస్యలను తెలుసుకునేందుకు కల్లాల్లో కాంగ్రెస్ పేరిట పర్యటిస్తున్నాం." -రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు
లింగంపేట మండలం నల్లమడుగులో ధాన్యం కాపలాకు వెళ్లి పాముకాటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఎల్లారెడ్డి ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో రైతులు కల్లాల వద్ద ఇబ్బందులకు గురవుతున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని హామీ ఇచ్చారు. రైతులకు భరోసా ఇవ్వడానికి కల్లాల్లోకి కాంగ్రెస్ పేరిట ఈ నెల 29 వరకు తెలంగాణ రాష్ట్రమంతటా పర్యటిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: