అన్యాక్రాంతానికి గురైన విలువైన భూములను ఈనాడు- ఈటీవీ భారత్ కథనం వెలుగులోకి తెచ్చింది. పేదల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కబ్జాదారులు ప్రయత్నాలు మొదలెట్టారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లిలో (చైతన్యనగర్) ప్రభుత్వ స్థలంపై కన్నేశారు. దీనిపై 'పాగా వేసేందుకు పునాదులు' శీర్షికతో ఈనాడు- ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. దీంతో గ్రామస్థుల ఫిర్యాదుతో తహసీల్దార్ గోవర్ధన్ విచారణ చేపట్టారు. భూమి కబ్జాకు గురి కాకుండా బోర్డు ఏర్పాటు చేశారు.
స్థిరాస్తి వ్యాపారుల కన్ను
చైతన్యనగర్‌లో కూలీలకు కేటాయించని అర ఎకర పొలాన్ని ఆక్రమించేందుకు స్థిరాస్తి వ్యాపారులు ప్రయత్నించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఖాళీ భూమిని చదును చేసి.. ఇళ్లు నిర్మించేందుకు సిమెంట్, ఇసుక, ఇటుకలు తెప్పించారు. ఈ విషయంపై స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వారు స్పందించపోవడంతో ప్రజావాణిలో జిల్లా పాలనాధికారికి విన్నవించారు. ఈ కాలనీలో మరో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉందని.. అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.