రెండు చేతులు లేకున్నా.. కాలి వేళ్లతోనే ఆణిముత్యాల్లాంటి అక్షరాలు రాస్తున్న ఇతని పేరు భానుప్రసాద్. చదువులో సత్తా చాటుతూనే.. చెస్, క్యారమ్స్ వంటి క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిస్తున్నాడు. విధి చిన్నచూపు చూసినా.. దేవుడు తలరాత తలకిందులు చేసినా.. వైకల్యం ఎదురు నిలిచినా.. మొక్కవోని దీక్షతో అడ్డంకులన్నీ తలవంచేలా ముందుకు సాగుతున్నాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన భానుప్రసాద్.. సంఘరావు, రమణభాయిల మొదటి సంతానం. బాల్యం నుంచే రెండు చేతులు పనిచేయకపోవడం చూసిన తల్లిదండ్రులు బాధను దిగమింగుకుని తమ కుమారుడిని ఉన్నతస్థాయిలో చూడాలనుకున్నారు. ఆ దిశగా ప్రోత్సహించి ప్రైవేట్‌గా ట్యూషన్ చెప్పించారు.
అక్కడే ఆశ చిగురించింది
ట్యూషన్ చెప్పే మధు... భానుకు జీవితంపై ఆశలు చిగురించేలా చేశాడు. కాళ్లతో అక్షరాలు రాయడం నేర్పించి అతని తలరాతనే మార్చేశాడు. భాను.. గ్రామంలోని పాఠశాలలో చేరాడు. తోటి విద్యార్థులతో సమానంగా చదవడం, రాయడం ప్రారంభించాడు. మిగతా విద్యార్థులతో పోటీపడి పదో తరగతిలో 7.5 గ్రేడ్ సాధించాడు. ఇంటర్ సీఈసీలో 751 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.
చదువులోనే కాదు...
భాను... కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ కోర్సు చదువుతున్నాడు. చదువే కాకుండా ఆటల్లోనూ భానుప్రసాద్ సత్తా చాటాడు. చిన్నప్పటి నుంచే కబడ్డీ ఆడటం అలవాటు చేసుకున్నాడు. క్యారమ్స్, చెస్ ఆడతాడు. కాలుతోనే చక్కని బొమ్మలు గీస్తాడు. కాలి వేళ్లతో భాను రాసే అక్షరాలు ఆణిముత్యాల్లా ఉంటాయి. సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఫోన్ కాల్స్, మెసేజెస్ చేస్తున్నాడు. భానును చూస్తే చేతులు లేవన్న భావన అసలే కనిపించదు.
పట్టుబట్టి... పోటీ పడుతూ...
డిగ్రీలో చేరే సమయంలో కళాశాలకు వెళ్లిన భాను.. కంప్యూటర్స్ కోర్సు చదవాలని భావించాడు. వైకల్యం వల్ల కంప్యూటర్ ఆపరేట్ చేయడం ఇబ్బంది అవుతుందని భావించిన కళాశాల యాజమాన్యం వేరే కోర్సు తీసుకోమని సూచించింది. కానీ భాను మాత్రం పట్టుబట్టి మరీ బీకాం కంప్యూటర్స్‌లో చేరాడు. మిగతా విద్యార్థులతో పోటీ పడి మరీ కంప్యూటర్స్ నేర్చుకున్నాడు. అందరి కంటే వేగంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు.
అందరికీ ఆదర్శం..
సంకల్ప బలం, కఠోర సాధన ఉంటే ఏదైనా సాధంచగలమని భాను నిరూపించాడు. వైకల్యంతో బాధపడుతూ ఏమీ సాధించలేమన్న భావనలో ఉన్న మరెందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భాను ఆశయం నెరవేరాలని మనమూ ఆశిద్దాం...
- ఇదీ చూడండి : ఆరిపోతున్న ఆ ఇంటికి 'ఈటీవీ భారత్' వెలుగునిచ్చింది!