Man climbs High-tension Tower : కామారెడ్డి మున్సిపాలిటీలో పని చేస్తున్న తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని ఓ పారిశుద్ధ్య కార్మికుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని పాతరాజంపేట శివారులో జరిగింది. ఘనపురం పురుషోత్తం అనే వ్యక్తి కామారెడ్డి మున్సిపాలిటీలో గత నాలుగేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కావాలనే తనను పనిలో నుంచి తొలగించేలా చేశారని ఆరోపిస్తూ... తనను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తన ఉద్యోగం పోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనాస్థలానికి చేరుకుని పురుషోత్తంకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కలెక్టర్ వస్తేనే కిందకు దిగుతానని భీష్మించాడు. సుమారు రెండు గంటల పాటు టవర్‌పై హల్‌చల్ చేశాడు. అటువైపుగా వెళ్తున్న కామారెడ్డి ఆర్డీవో... టవర్ దగ్గర కాసేపు ఆగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు గంటల అనంతరం పురుషోత్తం కిందకు దిగగా... పోలీసులు ఆయనను స్టేషన్‌కు తరలించారు.
నన్ను అకారణంగా పనిలోనుంచి తొలగించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కావాలనే.... నాపై లేనిపోనివి చెప్పి పనిలో నుంచి తొలగించేలా చేశారు. నన్ను తిరిగి పనిలోకి తీసుకోవాలి. ఆ ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.
-పురుషోత్తం, టవర్ ఎక్కిన వ్యక్తి
ఇదీ చదవండి: Hyderabad Drugs Case Update : ముమ్మరంగా స్టార్ బాయ్ వేట.. ఉచ్చు బిగిస్తున్న పోలీసులు