జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సమీపంలో ప్రవహించే తుంగభద్ర నదికి 2009 అక్టోబర్ 2న వరదలు వచ్చాయి. వరద ప్రవాహానికి అలంపూర్, రాజోలి, మద్దూరు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లు, వాకిలి దెబ్బతిన్నాయి. బాధితులకు ఇళ్లు నిర్మిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది జరిగి సరిగ్గా పన్నెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. అయినా.. నేటికి కూడా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు.
పట్టాలిచ్చారు కానీ స్థలమెక్కడ..
అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 43 ఎకరాల స్థలం కొనుగోలు చేసి బాధితులకు పట్టాలు ఇచ్చారు. పట్టాలైతే.. ఇచ్చారు కానీ.. నేటి వరకు వాటికి సంబంధించిన స్థలాన్ని చూపించలేదు. మానవపాడు మండలం మద్దూర్‌లో కూడా బాధితుల కోసం స్థలాన్ని కేటాయించారు. కానీ.. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే.. తమకు న్యాయం జరగడం లేదని.. వరదలు వచ్చి పన్నెండేళ్లు గడుస్తున్నా తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని మొర పెట్టుకుంటున్నారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం కంపచెట్లతో నిండిపోయింది. ఉండడానికి గూడు లేక.. బాధితులు ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లోనే జీవనం సాగిస్తున్నారు.
అవకతవకల పేరుతో పక్కనపెట్టేశారు..
వరద బాధితుల కోసం అలంపూర్‌లో అప్పటి ప్రభుత్వం 43 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. 940 మంది బాధితులను గుర్తించారు. కొంతమందికి పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత పట్టాలు పంచిన ఎమ్మెల్యే అబ్రహం ఓటమి పాలయ్యారు. ఆ స్థానంలో సంపత్ కుమార్ గెలిచారు. పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని.. సవరించి మరోసారి పట్టాలు పంచాలని ఆ ప్రక్రియను ఆపేశారు. అప్పటినుంచి.. ఇప్పటివరకు బాధితుల గురించి.. పట్టాల గురించి ఎవరూ పట్టించుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నది.. వరద బాధితులను గుర్తించి తమకు కూడా ఇల్లు కేటాయిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. లేనిపక్షంలో అధికారులు స్థల చూపిస్తే.. అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తామని వేడుకుంటున్నారు. ఐజ మండలంలోని కుట్కనూర్, ఇటిక్యాల మండలంలోని గార్లపాడు, రాజోలిలో కొంతమేర ఇళ్లు నిర్మాణం చేశారు. కానీ అలంపూర్, మద్దూరులలో మాత్రం బాధితుల కోసం స్థలాలు కేటాయించారు. గానీ.. ఇప్పటి వరకు ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తమకు అధికారులు ఇప్పటికైనా న్యాయం చేసి స్థలాలు కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'బాగా పనిచేస్తే దుబ్బాక స్థానం కాంగ్రెస్‌దే'