ఐదు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం వద్దనున్న గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుతోంది. ఈ క్రమంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project) ద్వారా మూడో సీజన్లో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజినీరింగ్ అధికారులు సిద్ధమయ్యారు.
ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project)లో కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లోని 17 మోటార్లకుగాను... నాలుగింటిని ప్రారంభించారు. వరుస క్రమంలో 1, 2, 5, 7 నంబర్ మోటార్లు ప్రారంభించగా, ఎనిమిది పంపుల ద్వారా నీటిని గ్రావిటీ కాల్వలో ఎత్తిపోస్తున్నారు. జలాలు అన్నారం బ్యారేజీకి తరలుతున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 5.54 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. మేడిగడ్డ బ్యారెజీలో 16.17 టీఎంసీలకుగాను 7.5 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. మరో రెండు రోజుల్లో వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: kaleshwaram: గాయత్రి పంప్‌హౌజ్ వద్ద గోదారమ్మ పరవళ్లు