కరోనా వ్యాప్తి నేపథ్యంలోఖాళీగా ఉన్న రహదారులు ఇప్పుడు నిండుగా కనిపిస్తున్నాయి. లాక్డౌన్ నిబంధనలను సర్కారు సడలించిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ఇసుక క్వారీలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇసుక లారీలు వందలాదిగా తరలివస్తున్నాయి.
మహాదేవపూర్ మండలంలోని మహదేవపూర్, సూరారం, తదితర ఇసుక క్వారీలను జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి సందర్శించారు. కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఆదేశాలనుసారం ఇసుక క్వారీలను తనిఖీ చేసినట్లు ఆయన చెప్పారు. ఇసుక క్వారీల నిర్వహకులు,లారీ డ్రైవర్లు, సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా పరిశీలించినట్లు తెలిపారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇసుక క్వారీల సిబ్బంది ఆ ప్రాంతంలోనే ఉండాలని సూచించారు. అలాగే గ్రామాల్లో సంచరించకుండా పంచాయతీలు సైతం దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్థానిక సర్పంచులు,అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ నివేదిస్తామన్నారు. అనంతరం పాలనాధికారి ఆదేశాలనుసారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. _