Mistakes in inter question papers: ఇంటర్ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లుతుండడంతో ఇంటర్‌బోర్డు అధికారులు వాటిని గుర్తించి.. విద్యార్థులు సరిచేసుకొని జవాబులు రాసేలా చూడాలని పరీక్షా కేంద్రాల్లోని అధికారులకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజు శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం సంస్కృతంలో రెండు మార్కుల ప్రశ్నలు రెండు పునరావృతమయ్యాయి. అరబిక్‌లోనూ ఒక ప్రశ్నలో అక్షర దోషాలు వచ్చాయి. ద్వితీయ ఏడాది పరీక్షలు శనివారం ప్రారంభమవగా తెలుగు(ఓల్డ్) ప్రశ్నపత్రంలోని 10వ ప్రశ్నలో ప్రత్యేకత బదులు ‘ప్రత్యేక’ అని ప్రచురితమైంది. రెండో ప్రశ్నలో చినుకులు బదులు ‘చినుకుల’ అని ముద్రితమైంది. ఉర్దూ సబ్జెక్టులో గుల్‌దాన్ బదులు ‘గుల్‌దన్’ అని వచ్చింది. వాటిని సరిచేసుకొని చదువుకొని జవాబులు రాసేలా విద్యార్థులకు సూచించాలని అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఇన్విజిలేటర్లు వాటిని చదివి వినిపించారు.
* జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒక విద్యార్థినికి సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఆ విషయాన్ని పరీక్ష రాసిన అనంతరం ఆ విద్యార్థిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి తండ్రికి చెప్పింది. ఆయన ఈ విషయాన్ని పరీక్ష కేంద్రం సిబ్బంది, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనకు బాధ్యులైన ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లకు డీఐఈవో మెమోలు జారీ చేశారు. కాగా మరో విద్యార్థి హిందీకి బదులుగా సంస్కృతం పరీక్ష రాసి వెళ్లినట్లు తెలిసింది.
* ఇంటర్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాషకు మొత్తం 4,37,865 మందికిగాను 4,16,964 మంది (95.30శాతం) హాజరయ్యారు. కాపీయింగ్‌కు పాల్పడుతూ మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున డిబార్ అయ్యారు. నిమిషం నిబంధన.. ఎనిమిది మంది విద్యార్థులను ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్షకు దూరం చేసింది. శనివారం జనగామ జిల్లాలో అయిదుగురు, మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు పరీక్షకు నిర్ణీత సమయం దాటాక రావడంతో వారిని అధికారులు పరీక్ష హాలులోకి అనుమతించలేదు.
ఇవీ చూడండి: Crop Booking: పంట నమోదుకు ‘క్రాప్ బుకింగ్’ మొబైల్ యాప్
Horoscope Today (08-05-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..