జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్దనగిరిలో ఓ పిచ్చికుక్క ముగ్గురు చిన్నారులపై కర్కశంగా దాడిచేసింది. ముఖం, చెవి, కళ్లపై కొరికి తీవ్రంగా గాయపర్చింది. గ్రామానికి చెందిన షాహిని(4), అమూల్య(7), గొడుగు అనిల్, ఏడాదిన్నర బాలుడు మహాసిన్.. శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిచ్చికుక్క దాడి చేసింది. షాహిని చెవిని కొరకగా అది తెగి కిందపడింది. అమూల్యకు చెవి వద్ద తీవ్ర గాయమైంది. మహాసిన్ చెంపను తీవ్రంగా గాయపరిచింది.
అడ్డుకోవడానికి వచ్చిన వారిపైనా శునకం దాడికి ప్రయత్నించగా.. స్థానికులు వెంటాడి కర్రలు, రాడ్లతో కొట్టి చంపేశారు. బాధిత చిన్నారులను 108 వాహనంలో జనగామకు తరలించి మాతా, శిశు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.