జనగామ జిల్లా పర్యావరణ హితం కోసం ఇంధన వనరుల పొదుపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. త్వరలో ఇది దేశవ్యాప్తంగా అమలు కానుంది. ఇంధన వనరుల పొదుపుపై అవగాహన పెంచేందుకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండు పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి పాఠశాలలో కనీసం యాభై మంది విద్యార్థులతో ఇంధన వినియోగ సంఘాల (ఎనర్జీ కన్జర్వేషన్ క్లబ్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పురుడుపోసింది. పలు కార్యక్రమాల నిర్వహణకు గాను ప్రతి పాఠశాలకు రూ.4,800 చొప్పున మూడు విడతల్లో నిధులు మంజూరు చేసింది. వీటిని సమావేశాలు, ప్రదర్శనల నిర్వహణ, కరపత్రాలతో ప్రచారం చేసేందుకు వెచ్చించారు.
ప్రధానంగా తొమ్మిదో తరగతి విద్యార్థులతో ఈ క్లబ్‌లను నిర్వహించాలని వారు తక్కువగా ఉంటే ఎనిమిదో తరగతి విద్యార్థులను కలుపుకొని పోవాలని సూచించింది. పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉన్నందున వారిని ఈ క్లబ్‌లలో సభ్యత్వాలకు దూరంగా ఉంచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహా చురుగ్గా ఉండే ఉపాధ్యాయుడి ఆధ్వర్యంలో ఈ సంఘాలు పని చేస్తాయి. తొలుత ఈ క్లబ్ సభ్యులు పాఠశాలను వేదికగా తీసుకొని పని చేస్తారు.
పాఠశాల ఆవరణలో ఉండే మంచినీటి కుళాయిని అవసరమున్నపుడే వాడుకునేలా నిఘా పెడతారు. కిటికీలను తెరిచి సీలింగ్ ఫ్యాన్లను ఆపేస్తారు. అనవసరంగా వెలిగే విద్యుత్ దీపాలను వెంటనే ఆర్పి వేస్తారు. ఇలా ఎప్పటికప్పుడు ఇంధన దుర్వినియోగాన్ని కట్టడి చేస్తారు. ప్రతి వారం జరిగే సమీక్ష సమావేశంలో ఎవరెవరు ఎలా ఇంధనాన్ని పొదుపు చేశారన్నది వివరిస్తారు. ఇలాంటి సంస్కరణలను అంత తేలిగ్గా అంగీకరించని వారికి విద్యార్థులు ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తారు.
పర్యావరణ హితం-ప్లాస్టిక్‌కు వ్యతిరేకం
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు క్లబ్ సభ్యులు అన్నం కూరగాయలను అవసరమున్నంత వరకే వేసుకునేలా దగ్గరుండి చూస్తారు. కంచాలు సహా విద్యార్థులు కాళ్లు చేతులు కడుక్కునే నీటిని కాల్వల్లోకి వెళ్లనివ్వకుండా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు మళ్లిస్తారు. మొక్కల మొదళ్లలో పడ్డ ఆకులను సేకరించి తడి పొడి చెత్తను వేరు చేసి భద్ర పరుస్తారు. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగంపై అనాసక్తత కల్గిస్తారు.
జిల్లాలో ఎంపికైన పాఠశాలల వివరాలివి
పాలకుర్తి నియోజకవర్గంలో చెన్నూరు ప్రభుత్వ ఉన్నతపాఠశాల, పాలకుర్తి ప్రభుత్వ ఉన్నతపాఠశాల, జనగామ నియోజకవర్గంలో ధర్మకంచ ప్రభుత్వ ఉన్నతపాఠశాల, గానుగపహాడ్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల, ఇటికాలపల్లి ప్రభుత్వ ఉన్నతపాఠశాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో చిల్పూర్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల, ఇప్పగూడెం ప్రభుత్వ ఉన్నతపాఠశాలను ఇందుకోసం ఎంపిక చేశారు.
ఇదీ సంగతి : రోడ్డుపై ఉమ్మేసిన వ్యక్తికి రూ.100 జరిమానా