రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలు దొంగిలించే ఎనిమిది మంది ముఠా సభ్యులను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జనగామ పట్టణ ఇన్‌ఛార్జి సీఐ సంతోష్ కథనం ప్రకారం.. పట్టణంలోని వడ్లకొండ బైపాస్ రహదారి వద్ద పట్టణ ఎస్సై రాజేష్‌నాయక్ తన సిబ్బందితో గురువారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొంతమంది పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
జనగామ మండలం వడ్లకొండకు చెందిన కొలిపాక నాగరాజు, బొల్లం విజయ్‌చంద్ర, ఓబుల్‌కేశ్వాపూర్‌కు చెందిన జంగిలి సత్తయ్య, ముక్క ఇవీన్, ఎర్రగొల్లపహాడ్ శివారు పెద్దతండాకు చెందిన నీనావత్ ప్రతాప్, జనగామ పట్టణం గుండ్లగడ్డకు చెందిన గౌలిగారి రోహిత్, దేవరుప్పుల మండలం ధర్మగడ్డతండాకు చెందిన భూక్య నరేష్, బచ్చన్నపేట మండలం చిన్నరామన్‌చర్లకు చెందిన గంధమల్ల మనోజ్ జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్, కీసరగుట్ట, బండి తిరుమలగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, కరీంనగర్ జిల్లా బెజ్జంకి, జనగామ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీ చేసిన తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ముఠాను పట్టుకున్న ఎస్సై రాజేష్‌నాయక్, సిబ్బంది రవీందర్‌రెడ్డి, కృష్ణ, జాకీర్‌హుస్సేన్, రామన్నలను డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్ అభినందించారు.
ఇవీ చూడండి: పనిచేస్తున్న దుకాణంలోనే చోరీ... గంటల్లోనే ఛేదించిన పోలీసులు