కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రయోగాత్మక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య బృందాలు.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సిరో ప్రొవిలెన్స్ సర్వే చేపట్టాయి. తొలివిడతలో రాష్ట్రంలోని నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో.. ర్యాండమ్ పద్ధతిలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు.
సర్వే కోసం జిల్లాకు 5 బృందాల చొప్పున మొత్తం 15 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపనున్నారు. మొదటగా జనగామ జిల్లాలోని జనగామ, దేవరుప్పల, లింగాల గణపురం, బచ్చన్నపేట, నర్మెట్ట గ్రామాల్లో నమూనాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో కరోనా ప్రభావాన్ని అంచనా వేసి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని వ్యూహాలు రూపొందించే అవకాశముంది.