Issues Of Ethanol Project In Jagtial District : జగిత్యాల జిల్లా స్తంభంపల్లి, పాశిగామ గ్రామాల మధ్య ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ పర్యవసానాలపై అధ్యయనానికి గ్రామస్థులు శ్రీకారం చుట్టారు. ఏ విధమైన నష్టం ఉండదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కరీంనగర్ జిల్లా పర్లపల్లిలో ఉన్న ఇలాంటి పరిశ్రమను క్షేత్ర స్థాయిలో సందర్శించారు. పరిశ్రమ లోపలికి అధికారులు అంగీకరించకపోవటంతో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇబ్బందులపై పర్లపల్లి ప్రజలను విచారించారు.
Jagtial Ethanol Project : కంపెనీ విస్తరణలో భాగంగా జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో ఇథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని క్రిభ్‌కో ప్రకటించింది. 750 కోట్ల రూపాయలతో ఏడాదికి 8 కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కంపెనీని స్థాపించేందుకు ముందుకొచ్చింది. స్తంభంపల్లి శివారులోని 1091 సర్వే నెంబర్‌లో కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇథనాల్ పరిశ్రమ నుంచి కాలుష్యంతో ఆరోగ్య సమస్యలతో పాటు వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతాయని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
ఇబ్బందులను తెలుసుకున్న ప్రజలు: ఇథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమతో పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి లభిస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందటంతో పాటు భూముల ధరలు పెరుగుతాయని సూచిస్తున్నారు. అక్కడ పండే వరి, మొక్కజొన్న పంటలను సైతం కొనుగోలు చేస్తామని నచ్చచెబుతున్నారు. దీంతో పరిశ్రమ ఏర్పాటు వల్ల వచ్చే పర్యవసనాలను అధ్యయనం చేసేందుకు పర్లపల్లిలోని ఇథనాల్ పరిశ్రమను స్తంభంపల్లి, పాశిగామ ప్రజలు సందర్శించారు. అక్కడి స్థానికులతో మాట్లాడిన గ్రామస్థులు పరిశ్రమ ఏర్పాటుతో ఇబ్బందులు తప్పవని వివరించినట్లు వెల్లడించారు.
ప్రజల గోడును పట్టించుకునే వారే లేరా: పరిశ్రమ సందర్శనకు వచ్చిన వారికి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు పర్లపల్లి గ్రామస్థులు తెలిపారు. స్థానికులకు ఇస్తామన్న ఉద్యోగాలివ్వకపోవటంతో ఆందోళనలు చేపడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని వెల్లడించారు. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమ ఏర్పాటుకు ముందే అడ్డుకోకుంటే తర్వాత చేసేదేమి ఉండదని గ్రామస్థులకు వివరించినట్లు వెల్లడించారు. మరోవైపు పరిశ్రమ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మాత్రం పరిశ్రమ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ప్రభుత్వ వాదనతో పాటు వాస్తవ పరిస్థితుల సందర్శించిన స్తంభంపల్లి, పాశిగామ వాస్తవ్యులు పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: