Jagtial Master Plan Controversy Updates Today: మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. జగిత్యాల నుంచి నిజామాబాద్, ధర్మపురి, కరీంనగర్, గొల్లపల్లి వెళ్లే మార్గాల్లో అన్నదాతలు రాస్తారోకో చేపట్టి తమ నిరసన తెలుపుతున్నారు. పట్టణాన్ని రైతులు అష్టదిగ్బంధం చేశారు. రోడ్లపైనే వంటావార్పు చేపట్టడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభావిత గ్రామాలైన అంబారిపేట, హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, నర్సింగపూర్‌కు చెందిన రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో జగిత్యాలలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
మాస్టర్ ప్లాన్ వ్యతిరేకతపై కారణాలు ఇవీ: జగిత్యాల ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ చిచ్చు రేపుతోంది. 2041 వరకు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళికకు ముసాయిదా విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే రోడ్ల విస్తరణ, పారిశ్రామిక, వాణిజ్య, పబ్లిక్, సెమీ పబ్లిక్, పార్క్, ప్లేగ్రౌండ్స్ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084 హెక్టార్లుగా అధికారులు ప్రతిపాదించారు.
ఏ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు: మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో సమీప గ్రామాలను చేర్చడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నర్సింగాపూర్, కండ్లపల్లి, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హస్నాబాద్, లింగంపేట, మోతె వాసులు తమ భూములపై హక్కులు కోల్పోతామని వాపోతున్నారు. కనీస అవగాహన కల్పించకుండానే పంచాయతీల తీర్మానాలను బలవంతంగా తీసుకున్నారని స్థానిక నేతలు, రైతులు ఆరోపిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ మాకొద్దు: హస్నాబాద్, నూకపల్లి, ధరూర్, తిప్పన్నపేట, తిమ్మాపూర్, మోతె గ్రామ పంచాయతీలు సమ్మతి తెలియజేస్తూ తీర్మానాలు అందించాయి. గ్రామ సభలు నిర్వహించకుండానే సమ్మతి తెలుపుతూ తీర్మానించిన సర్పంచ్‌లు సైతం.. ఇప్పుడు రివర్స్ అయ్యారు. మాస్టర్ ప్లాన్ వద్దంటూ అధికారులకు విన్నవిస్తున్నారు. బఫర్‌జోన్, పారిశ్రామిక కేంద్రాలు, రిక్రియేషన్, పబ్లిక్ సెమీ, పబ్లిక్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు లభించవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నుంచి నాయకుల వరకు: అధికారులు ఇది కేవలం ప్రతిపాదన అని ప్రకటించినా రైతులు ఆయా గ్రామాల వారు మాత్రం ముసాయిదాను ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు.మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై తొలుత రైతుల నుంచి నిరసన వ్యక్తం కాగా..ఇప్పడు అధికార పార్టీకి చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు తోడయ్యారు. రద్దు చేయకుంటే పదవులు త్యజించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఇవీ చదవండి: