దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల చివరిలో పెద్దఎత్తున పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన అధికారులతో హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉపకరణాల పంపిణీ విషయమై వారితో చర్చించారు. దివ్యాంగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమాభిమానాలు ఉన్నాయన్న మంత్రి.. సుమారు రూ.21 కోట్లతో 14 వేల మందికి ఉచితంగా ఉపకరణాలు అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ మంత్రులు, శాసనసభ్యులు ఉపకరణాలు పంపిణీ చేస్తారని కొప్పుల తెలిపారు. దాదాపు 600 మందికి వందశాతం రాయితీతో రూ.51 వేల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకంగా లక్ష రూపాయలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కర్ర సహాయంతో మెట్లు ఎక్కేవారి కోసం తయారు చేసిన ఉపకరణాలను మంత్రి పరిశీలించారు. వీటిని తయారు చేసిన గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్‌ను ఆయన అభినందించారు. దివ్యాంగులు సులువుగా కారు ఎక్కి, దిగేలా రూపొందించిన సీటు, మెట్లు ఎక్కేందుకు రూపొందించిన అల్యూమినియం ర్యాంప్‌ను కొప్పుల ఈశ్వర్ ఆసక్తిగా తిలకించారు.