ఎల్‌జీ పాలిమర్స్ లీకేజీ నేపథ్యంలో నలుగురు రైల్వే సిబ్బంది విషవాయువు బారినపడి స్పృహ కోల్పోయారని వాల్తేరు డివిజన్ అధికారులు స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున స్టైరీన్ లీకేజీ జరగ్గా, అదే రోజు అర్ధరాత్రి దాటాక ప్లాంట్‌కు కిలోమీటరున్నర దూరంలో ఉన్న సింహాచలం రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు గూడ్స్ రైలు సిబ్బంది స్పృహ కోల్పోయారు. వీరిలో ఒకరు లోకోపైలెట్, మరొకరు సహాయ లోకోపైలెట్. శనివారం అర్ధరాత్రి దాటాక మరో ఘటన జరిగింది. ప్లాంట్‌కు అతిదగ్గరగా ఉన్న ఉత్తర సింహాచలం రైల్వేస్టేషన్ లాబీలో మరో ఇద్దరు సిబ్బంది స్పృహ కోల్పోయారు.
వీరిలో ఒకరు వాల్తేరు డివిజన్‌కు చెందిన సహాయ లోకో పైలెట్ ఎల్.మండల్ కాగా రెండో వ్యక్తి విజయవాడ డివిజన్‌కు చెందిన గార్డు జీవన్‌కుమార్ అని రైల్వే అధికారులు సోమవారం వెల్లడించారు. ఆ సిబ్బంది గూడ్స్ రైలులో ఉండగానే ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉందని వివరించారు. బాధితులు కోలుకున్నాక పూర్తి వివరాలు తీసుకున్నామన్నారు. జీవన్‌కుమార్ రాజమహేంద్రవరం వైపు నుంచి గూడ్సు రైలులో వచ్చి డ్యూటీ దిగారని, ఎల్.మండల్ డ్యూటీకి ఎక్కేలోపు ఈ ఘటన జరిగిందని.. ఆ సమయానికి వారిద్దరూ ఉత్తర సింహాచలం రైల్వేస్టేషన్ లాబీలో ఉన్నారని వివరించారు.
రైల్వే ఆసుపత్రిలో వివరాలున్నాయి: డీఆర్‌ఎం
గ్యాస్ వల్లే రైల్వే సహాయ లోకోపైలెట్, గార్డు అస్వస్థతకు గురయ్యారని రైల్వే ఆసుపత్రిలో రికార్డు ఉంది. సింహాచలం నార్త్ స్టేషన్‌లో ఉన్నప్పుడు వారికి గ్యాస్ వాసన వల్ల వాంతులొచ్చాయి. అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసింది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అంతా బాగుందని స్పష్టత రావడంతో సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక్ రైలును ఝార్ఖండ్‌కు పంపింది. ఇప్పుడు పరిస్థితులు అదుపులో ఉన్నాయని, సమస్య లేదని భావిస్తున్నాం.
- చేతన్‌కుమార్ శ్రీవాస్తవ, వాల్తేరు డీఆర్‌ఎం ఆరోపణ
అంతా శుద్ధ అబద్ధం: మంత్రి బొత్స
'రైల్వే కోపైలెట్, గార్డు విషవాయువుతో శనివారం నాడు స్పృహ కోల్పోయారనేది వాస్తవ విరుద్ధం. ‘మీడియాలో వచ్చిన వార్త శుద్ధ అబద్ధం. అంతా అబద్ధం. ఆ ఘటన జరిగింది గురువారం రాత్రి, తెల్లవారుజామున 2.45 గంటలకు. ఇదే వార్తను ఒక ఆంగ్లపత్రిక కోట్ చేసింది. మీరు రాసింది తప్పు. దయచేసి ఇలాంటి వార్తలు రాయవద్దని కోరుతున్నాం. ఇవాళ్టికైతే అంతా కంట్రోల్‌లో ఉంది.' - మంత్రి బొత్స సత్యనారాయణ
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..