అంతర్జిల్లా బదిలీలు కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రగతిభవన్‌కు వచ్చిన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేయడాన్ని టీఎస్ యూటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. 2012 తర్వాత బదిలీలకు ప్రభుత్వం అనుమతించలేదనీ, ఏళ్ల తరబడి భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తూ పిల్లల బాగోగులు చూసుకోలేకపోవడంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
2015లోనే జీవో 182 ప్రకారం ఉపాధ్యాయులు మినహా ఇతర ఉద్యోగుల బదిలీలు జరిగాయనీ, తమకు కూడా బదిలీలు నిర్వహించి న్యాయం చేయాలని మంత్రులు, అధికారుల చుట్టూ ఉపాధ్యాయులు తిరుగుతున్నారని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు.
'2018లో సాధారణ బదిలీలు పూర్తయిన వెంటనే అంతర్జిల్లా బదిలీలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ త్వరలోనే బదిలీలు చేస్తామన్నారు. కానీ నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభించలేదు. కనీసం ప్రగతిభవన్‌కు వచ్చి వినతిపత్రం ఇస్తే అయినా సీఎం న్యాయం చేస్తారేమో అనే ఆశతో కుటుంబ సభ్యులతో సహా ప్రగతిభవన్‌కి వచ్చి వేడుకుంటున్న ఉపాధ్యాయులను, చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం బాధాకరం.'
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి
ప్రభుత్వం వెంటనే అంతర్జిల్లా బదిలీలకు షెడ్యూల్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం