కరోనా వైరస్ బారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రధాని మోదీ మంచి సందేశం ఇచ్చారని గవర్నర్ తమిళిసై కొనియాడారు. కొవిడ్-19 వ్యాప్తిని స్వీయ నియంత్రణతోనే కట్టడి చేయగలమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం స్వీయ గృహ నిర్బంధమే ఉత్తమమన్నారు. ఇంట్లోనే ఉండాలని.. ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు ఐసోలేషన్లోనే ఉండాలన్నారు.
వైద్య సిబ్బంది, ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల కృషిని గవర్నర్ ప్రశంసించారు. వారి కృషికి గుర్తింపుగా ప్రతి ఇంట్లో మార్చి 22న సాయంత్రం 5 గంటలకు చప్పట్లు, గంటలు మోగించి.. కృతజ్ఞతలు తెలపాలని కోరారు. రాజ్ భవన్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
కరోనా ప్రభావం నేపథ్యంలో రాజ్భవన్లో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్న గవర్నర్ తమిళిసై.. రోజూ ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పర్యేవేక్షిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటిని పాటించకుంటే వైరస్ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు.
ఇవీచూడండి: సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా