revanth reddy letter to cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. గౌరవెల్లి నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే అక్కడ పనులు ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు. నిర్వాసితులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం వారికి పరిహారమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టులు, పొలాలకు నీళ్ల పేరుతో తెరాస అరాచకాలు చేస్తోందని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరిట రూ.వందల కోట్లు వెచ్చించి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గౌరవెల్లి రీడిజైన్‌తో ముంపు గ్రామాల సమస్య 1 నుంచి 8కి పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎకరా భూమి రూ.30 లక్షలుంటుందని తెరాస ప్రచారం చేస్తుందన్న రేవంత్ రెడ్డి.. గౌరవెల్లి నిర్వాసితులకు ఆ ధర ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించి 8 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ 186 మందికి అసలు పరిహారమే అందకపోవడం దారుణమన్నారు.
న్యాయం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలి..: పరిహారం అడిగిన నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం ఏంటన్న రేవంత్ రెడ్డి..పరిహారం ఇవ్వకుండా రైతులను అరెస్టు చేసి బేడీలు వేస్తారా అని నిలదీశారు. సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని సూచించారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి..
'అంత పెద్ద నేరం ఏం చేశాం.. మాకు సంకెళ్లా...!'
పోడు రైతుల పోరు ఆగేదెప్పుడు..? వారి సమస్యకు పరిష్కామెప్పుడు.?
ట్రాక్టర్లతో 'టగ్ ఆఫ్ వార్'.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. వీడియో వైరల్!