కరోనాతో కుదేలైన అన్ని రంగాల్లో పర్యాటక రంగం ఒకటి. కర్ఫ్యూ ఆంక్షల నుంచి లాక్‌డౌన్ విధింపు వరకు ఆది నుంచి మహమ్మారి ప్రభావానికి గురైన పర్యాటక రంగం లాక్‌డౌన్ ఎత్తివేతతో కాస్త ఊపిరి పీల్చుకోనుంది. పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తివేయటంతో ఆదివారం కొన్ని బహిరంగ పర్యాటక ప్రాంతాలు, పార్కులు సందర్శకులతో సందడిగా కనిపించాయి. దుర్గం చెరువు తీగల వంతెన, ట్యాంక్ బండ్, లూంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్ వంటివి తెరుచుకోగా.. నగర ప్రజలు సేదతీరేందుకు వచ్చారు. నేటి నుంచి మిగిలి అన్ని పర్యాటక ప్రాంతాలు అందుబాటులోకి రానున్నాయి.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
గోల్కొండ కోట, చార్మినార్, సెవెన్ టూంబ్స్, మ్యూజియం, ఇతర అన్ని పార్కుల్లో పర్యాటకులను అనుమతించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, నిర్వహకులు శానిటైజర్లు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. శిల్పారామం సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి తెరుచుకోనుంది. రాత్రి 8గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు.
చాలా రోజుల తర్వాత ప్రారంభం
కరోనా ఒత్తిడి నుంచి చాలా రోజుల తర్వాత ఉపశమనం దొరుకుతోందని... పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజలు తప్పక నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: CJI:తెలుగు రాష్ట్రాల పర్యటనలో భావోద్వేగానికి గురయ్యా: జస్టిస్ ఎన్‌వీ రమణ