తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను తితిదే ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తోంది. కొవిడ్ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌లోనే సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందించాలని తితిదే నిర్ణయించింది. బుధవారం శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో టోకెన్లు జారీ చేస్తోంది. ఇందుకోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో కౌంటర్లు సిద్ధంచేశారు. రోజుకు పదివేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.
కలియుగ వైకుంఠనాథుడు, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతి వస్తుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు సాధారణ భక్తులు ఏడు కొండల వాడి దర్శననానికి తిరుపతిలో జారీ చేసే ఉచిత సర్వదర్శన టోకెన్లపై ఆధారపడతారు. కానీ కరోనా మహమ్మారితో సర్వదర్శన టోకెన్ల సంఖ్యను తితిదే పరిమితం చేసింది. కరోనా మొదటి దశ ముగిసిన అనంతరం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 8వేల టికెట్లను జారీ చేశారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే కరోనా రెండో దశ తీవ్రమవడంతో సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ నిలిపివేశారు. గత ఏడాది ఏప్రిల్ నెల 11 నుంచి అక్టోబర్ వరకు సర్వదర్శనాలను నిలిపివేసిన తితిదే... 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్, సిఫార్సు లేఖలు ఇలా వివిధ రూపాల్లో రోజుకు 20 వేల మందికి దర్శనం కల్పించేది.
6 నెలల తర్వాత తిరిగి ప్రారంభం..
దాదాపు 6 నెలల తర్వాత సర్వదర్శనాన్ని తితిదే తిరిగి ప్రారంభించింది. రోజుకు 8 వేల చొప్పున ఆన్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారుతోందని భావించిన తితిదే.. తిరుపతిలో నేరుగా టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. రోజుకు 10వేల టికెట్ల చొప్పున జారీ చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో.. తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది. మార్చి నెల నుంచి మరో 5 వేలు పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: Punganur Cow on Postal Cover : తపాలా కవర్‌పై పుంగనూరు జాతి ఆవు