Double Bedroom Houses 3rd Phase Distribution in Hyderabad : జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల (Double Bedroom Houses ) పంపిణీ మూడో విడత కార్యక్రమాన్ని.. త్వరలోనే చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు అక్టోబర్ 2, 5 తేదీల్లో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజలు ఎంతో గొప్పగా బతకాలని, వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా వీటిని చేపట్టినట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం : రూ.9,600 కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంతో విలువైన స్థలాల్లో.. ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. మొదటి విడతలో 11,700 మందికి, రెండో విడతలో 13,200 మందికి ఇళ్లను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు వివరించారు. మూడో విడతలో 36,884 మందిని ఎంపిక చేయడం జరిగిందని తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
2BHK Distribution in GHMC Will Soon : ఇందులో భాగంగా అక్టోబర్ 2న 19,020 మందికి ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అదేవిధంగా అక్టోబర్ 5న మిగిలిన వారికి ఇళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో 3142 మంది లబ్ధిదారులకు.. మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్‌పల్లిలో 1361 మంది లబ్ధిదారులకు మంత్రి మహేందర్ రెడ్డి పంపిణీ చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
Double Bedroom Beneficiaries interview : ''సొంతింటి కల' నెరవేరుతుందని కల్లోకూడా ఊహించలేదు'
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్సాన్పల్లిలో 2099 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్లలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ 344 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగ్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 356 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్ రావు 6067 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని.. తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అహ్మద్‌గూడలో మంత్రి మల్లారెడ్డి 1965 మంది లబ్ధిదారులకు, మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని రాంపల్లిలో తాను.. 3214 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తానని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. 472 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.